Vangaveeti Politics : వంగవీటి రాజకీయం: వైసీపీనా.? టీడీపీనా.? గెలిచేదెవరు.!

Vangaveeti Politics : బెజవాడ రాజకీయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తనను హత్య చేసేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని సంచలన ఆరోపణలు చేయడంతో. అధికార పార్టీ నేతల సమక్షంలో వంగవీటి రాధ ఈ వ్యాఖ్యలు చేయడం, వెంటనే సదరు అధికార పార్టీ నాయకులు ఆ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం, ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు గన్‌మెన్లను కేటాయించడం చకచకా జరిగిపోయాయి.

టీడీపీ నేతగా వున్న వంగవీటి రాధకి వైసీపీ నేతలు, అందునా మంత్రి కొడాలి నాని బాసటగా నిలవడం ఆశ్చర్యకరమిక్కడ. అయితే, దాన్ని తప్పు పట్టడానికి లేదు. కాగా, ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను వంగవీటి రాధ తిరస్కరించారు. మరోపక్క, వంగవీటి రాధకు ఫోన్ చేసి మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ ఆయనకు అండగా వుంటుందని కూడా బరోసా ఇచ్చారట.

ఇంకో వైపు వైసీపీ నేతల నుంచీ, అలాగే ఇతర పార్టీలకు చెందిన నేతల నుంచీ వంగవీటి రాధకు పరామర్శలు పోటెత్తాయ్. ఫోన్లలోనే చాలామంది పలకరించేశారు. ఒక్క బెజవాడలోనే కాదు, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాలతోపాటు, ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అయ్యింది.

మొత్తానికి వంగవీటి రాధ మాస్టర్ ప్లాన్ అదిరింది. ఎవరు రెక్కీ చేశారు.? అసలు ఆ అవసరం ఏమొచ్చింది.? ఎవరితో వంగవీటి రాధకు గొడవలున్నాయి.? ఇవన్నీ విచారణలో తేలొచ్చుగాక. వంగవీటి ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. పోలీసులు మాత్రం, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇంతకీ, ఈ మొత్తం వ్యవహారంలో గెలిచిందెవరు.? వంగవీటి రాధ మనసు గెలుచుకున్నదెవరు.? ఈ విషయమై వంగవీటి అనుచరులు ఆరా తీయడం షురూ చేశారట. వైసీపీ వైపే వంగవీటి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్న దరిమిలా, ఆయనతో గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేయించాలన్న చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టినట్లేనని అనుకోవాలేమో.