గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతిస్తున్నప్పటి నుంచి ఆ నియోజక వర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. వంశీ వర్గం… వైసీపీకి చెందిన దుట్టా రామచంద్రరావు వర్గం మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేసినా భగ్గుమనేలా ఉంది. నియోజక వర్గంలో మొదటి నుంచి దుట్టా కీలకంగా ఉన్నారు. ఆయన పోటీ చేయనప్పటికీ అక్కడ వైసీపి నుంచి చక్రం తిప్పేది ఆయనే. అయితే వంశీకి చంద్రబాబు నాయుడితో చెడటం..ఆపై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని లు వంశీని నేరుగా జగన్ మోహన్ రెడ్డి ముందు కుర్చోబెట్టడం వంటి సన్నివేశాలు జిల్లాలో చర్చకు తెరలేపాయి.
దీంతో ఇరువురి మధ్య కొన్ని నెలలుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఫలితంగా టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఆజ్యం పోసినట్లు అయింది. వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకి వచ్చేస్తే…ఉప ఎన్నిక బరిలో మళ్లీ వంశీనే నిలబెట్టే అవకాశం ఉందని ఇప్పటికే మీడియా ప్రచారం వేడెక్కిస్తోంది. పైగా వైసీపీ లో ఉన్న మంత్రులతో వంశీ కి మంచి ర్యాపో కూడా ఉంది. ఈ కారణాలన్ని వంశీకి కలిసొచ్చేవే. ఈ నేపథ్యంలో దుట్టా కూడా ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకునే ప్రయత్న చేస్తున్నారు. పార్టీ మార్చేవాడిని కాదు. నా తర్వాత పిల్లలు వైసీపీ జెండా నే మోస్తారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసులతో వేధించారు. బెదిరించారు..భయపెట్టారు. ఇప్పుడు నా వెంట జగన్ ఉన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడను అంటూ దుట్టా సంచలన వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజుల్లోనే అందరూ శుభవార్త వింటారు. అవసరమైతే ఎన్నికల బరిలోకి నేనే దిగుతానంటూ దుట్టా వ్యాఖ్యానించడం స్థానికంగా చర్చకు దారి తీసింది. అటు ఎమ్మెల్యేగా ఉన్న వంశీ ఎప్పటికప్పుడు తన బలం నిరూపించుకునే ప్రయత్నంలో ఉండటం..ఇటు దుట్టా వ్యాఖ్యలు చూస్తుంటే పంచాయితీ జగన్ ముందుకు రావడం ఖాయంగానే కనిపిస్తోంది.