ఇరు దాటాక తెప్ప తగలేసే రకం అనే సామెత రాజకీయాల్లో చాలామందికి సరిగ్గా సరిపోతుంది. పార్టీలు మారే నాయకులకు మరీ బాగా సూటవుతుంది. ఒక పార్టీలో ఉన్నప్పుడు అవతలి పార్టీ వాళ్ళని తిట్టిపోయడం, అధినేతను ఆకాశానికెత్తడం పార్టీ మారాక తిట్టినవారినే పొగడడటం, పొడిగినవారిని దుయ్యబట్టడం చూస్తే ఇదెక్కడి విడ్డూరం అనకుండా ఉండలేం. అందుకు బెస్ట్ ఉదాహరణే టీడీపీ నుండి వైసీపీకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ మారిన కొడాలి నాని అయినా 2019 ఎన్నికల తర్వాత జెండా మార్చిన వల్లభనేని వంశీ అయినా ఇదే రకం. వంశీ గన్నవరం నుండి టీడీపీ తరపున వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. అంటే చంద్రబ్బుతో ఆయన ప్రయాణం దగ్గర దగ్గర దశాబ్దం.
ఈ దశాబ్ద కాలంలో బోధపడని చాలా అంశాలు ఆయనకు గత ఏడాది కాలంలో బోధపడ్డాయి. చంద్రబాబు నిజస్వరూపం గత ఎన్నికల్లో ఆయన గెలిచాక పార్టీ ఓడాకే గుర్తొచ్చాయి. చంద్రబాబు గురించి వంశీకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదనే అనుకోవాలి. ఎవ్వరికీ ఇవ్వని చనువు వంశీకి ఇచ్చారు చంద్రబాబు. ఇద్దరికీ పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ పరిచయం ఎక్కువే. అలాంటి వంశీకి చంద్రబాబు రాజకీయం గురించి తెలియదని ఎలా అనుకోగలం. కానీ అనుకోవాలని అంటున్నారు వంశీ. చంద్రబబు రాజకీయం ఈమధ్యనే తెలిసొచ్చిందని అంటున్నారు ఆయన. వైసీపీకి మద్దతు ప్రకటించాక చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని తేల్చి పారేశారు వంశీ.
తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయినట్టే అన్న వల్లభనేని గెలిస్తే తన గొప్పతనం అని చెప్పుకునే చంద్రబాబు ఓడిపోయాడు కనక దొంగే దొంగ అని అరిసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. గెలిచిన పంచాయితీలు పుచ్చలపల్లి సుందరయ్య మార్గంలో ఏమైనా గెలిచారా, ఎదుటివారు గెలిస్తే డబ్బు ఖర్చు చేసి గెలిచారు అంటున్నారు. అసలు డబ్బు రాజకీయం మొదలు పెట్టిందే చంద్రబాబు. డబ్బు సంస్కృతిని కృష్ణ జిల్లా ఉయ్యూరులో మొదలుపెట్టింది చంద్రబాబేనని వంశీ మండిపడిపోయారు. మరి ఇంత తెలిసిన వంశీ 2014- 2019 మధ్య కాలంలోనే పార్టీ అధికారంలో ఉండగానే ఈ మాటలు మాట్లాడి ఉండవచ్చు కదా, పార్టీని వీడవచ్చు కదా. ఎందుకంటే అది రూలింగ్ సమయం. ఆ టైంలో ఎన్ని తప్పులు చేసినా ఒప్పులుగానే కనిపిస్తాయి.. ఇప్పుడు వైసీపీ గొప్పతనం తెలిసొస్తున్నట్టు.