వ్యాక్సిన్లు ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా ఎందుకు.?

YS Jagan Writes Letter To PM Modi again

 YS Jagan Writes Letter To PM Modi again

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా వ్యాక్సినేషన్ విషయమై రాసిన లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం, ప్రజలకు నేరుగా వ్యాక్సిన్ అందిస్తున్నప్పుడు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక ధర వెచ్చించి ప్రజలెందుకు వ్యాక్సినేషన్ కొనుక్కోవాలన్నది అసలు ప్రశ్న. ఈ ప్రశ్ననే వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో లేవనెత్తారు. వ్యాక్సినేషన్ విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసుకోవడానికి ఆస్కారం కల్పించింది. అలాగే, ప్రైవేటు ఆసుపత్రులు కూడా వ్యాక్సిన్ కొనుక్కోవచ్చని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఓ రేటు, ప్రైవేటు ఆసుపత్రులకు మరో రేటు చొప్పున వ్యాక్సిన్లను అమ్ముకోవచ్చని వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. కేంద్రానికి మాత్రం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం నామ మాత్రపు ధరకే వ్యాక్సిన్లను వ్యాక్సిన్ తయారీ సంస్థలు విక్రయించాలి.

ఈ విధానంపై మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 140 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్ అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. తన బాధ్యతలను వదిలించుకునేందుకు, రాష్ట్రాలకు వెసులుబాటు, ప్రైవేటు ఆసుపత్రులకు వెసులుబాటు.. అంటూ అర్థరహితమైన వ్యాక్సిన్ విధానాన్ని కేంద్రం తెచ్చింది. దీనిపై మొదట్లోనే తీవ్రంగా వ్యతిరేకించాల్సిన రాష్ట్రాలు, ఆ విషయాన్ని పక్కన పెట్టి.. సొంతంగా వ్యాక్సిన్ సమీకరించుకునేందుకు ప్రయత్నించాయి. వాటిలో లోటుపాట్లు అర్థమయ్యాయో ఏమోగానీ, కాస్త లేటుగా వైఎస్ జగన్, కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖ రాయడం మంచిదే. లేఖ రాస్తే సరిపోదు, నిలదీయాలి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల మద్దతునీ కూడదీయాలి. లేకపోతే, జగన్ రాసే లేఖల వల్ల ప్రయోజనం వుండదు.