వాళ్లిద్దరు నన్ను చంపేస్తారు – ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శృంగారపాటి సందీప్‌, చలివేంద్రపు సురేష్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పేకాట క్లబ్బులు నడిపి పోలీసులకు పట్టుబడ్డ వీరిద్ధరు… ఇప్పుడు తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. వీరి చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి అధిష్టానానికి తానే ఫిర్యాదు చేశానని భావించి తనపై కక్ష కట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు శృంగారపాటి సందీప్‌, చలివేంద్రపు సురేష్‌ ఎమ్మల్యే ఉండవల్లి శ్రీదేవిపై ప్రతిదాడి చేశారు. ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ… ఎమ్మెల్యే భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అవినీతిని ప్రశ్నించినందుకే… టీడీపీ నేతలతో కుమ్మక్కై తమని బలిపశువులు చేశారని ఆరోపించారు.

 

అయితే ఇప్పుడు ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్న వీరిద్ధరు… ఒకప్పుడు ఉండవల్లి శ్రీదేవి కీలక అనుచరులే. అయితే రెయిన్‌ ట్రీ పార్క్‌ లో పేకాట క్లబ్బుపై పోలీసులు దాడులు చేసి కేసులు పెట్టినప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య విభేధాలు ఏర్పడ్డాయి. పేకాట క్లబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే చెబుతుంటే…ఆమెగారు సహకరించడం వల్లే పేకాట క్లబ్బు నడిపామని మొదట్లో సందీప్, సురేష్ చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే పోలీసుల కేసు పెట్టడంతో ఇప్పుడు మాట మార్చి… ఎమ్మెల్యే భూకబ్జాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.

 

అయితే పేకాట క్లబ్బు విషయంలో గతంలో ఎమ్మెల్యే తో జరిపిన ఫోన్ సంభాషణలు వీరిద్ధరి వద్ద ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేని బెదిరించి ఉంటారని…అందుకే ఆమె కేసు పెట్టారని గుంటూరు వాసులు చెప్పుకుంటున్నారు.