అన్ స్టాపబుల్: బాలయ్య ఆ గుట్టు విప్పగలడా.?

స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత, తెలుగుదేశం పార్టీ పగ్గాల్ని నందమూరి బాలకృష్ణ ఎందుకు స్వీకరించలేకపోయారు.? ఈ ప్రశ్న నందమూరి అభిమానుల్ని తరచూ వేధిస్తుంటుంది. టీడీపీ పగ్గాల్ని చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీయార్ నుంచి లాగేసుకున్న వైనం అప్పటికీ, ఇప్పటికీ చాలామందికి మింగుడుపడని విషయమే.

స్వర్గీయ ఎన్టీయార్‌ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచి, టీడీపీని ఆయన్నుంచి చంద్రబాబు లాగేసుకున్నారన్నది ప్రధాన అభియోగం. ‘అది నాయకత్వ మార్పు తప్ప, వెన్నుపోటు కానే కాదు’ అంటారు చంద్రబాబు అనుచరులు. సరే, జరిగిందేంటన్నది ప్రపంచమంతా చూసింది.

చంద్రబాబుని తీవ్రంగా వ్యతిరేకించిన హరికృష్ణ ఆ తర్వాత సర్దుకుపోయారు. బాలకృష్ణ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ సర్వనాశనమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీది అదే పరిస్థితి.

అసలు ఈ చర్చ అంతా ఇప్పుడెందుకంటే, ‘ఆహా’ ద్వారా నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో మంచు మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న, విష్ణు పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో బాలయ్యకే ఓ ప్రశ్న ఎదురైంది మోహన్ బాబు నుంచి. అదే, టీడీపీ పగ్గాల్ని చంద్రబాబుకి ఎందుకు వదిలేశావ్ బాలయ్యబాబూ.? అని.

ఈ ప్రశ్నకు బాలయ్య నిజానికి సమాధానం చెప్పలేరు. చెప్పగలిగే పరిస్థితుల్లో బాలయ్య వుంటే, అసలు టీడీపీ పగ్గాలు నందమూరి కుటుంబం చేజారిపోయేవి కాదు. అదే సమయంలో, టీడీపీని మోహన్‌బాబు ఎందుకు వీడారన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. అదే ప్రశ్నను మోహన్ బాబుకి బాలయ్య కూడా సంధించారు.

తెలుగునాట ఎన్టీయార్ హయాంలో టీడీపీ అనేది ఓ ప్రత్యేకమైన చరిత్ర. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎన్టీయార్ మరణం వివాదాస్పదం.. అయినాగానీ, ఎన్టీయార్ తనయుడు బాలకృష్ణ, ఆనాటి ఆ పరిస్థితుల్ని ప్రభావితం చేయలేకపోయారు.. తండ్రికి అండగా నిలవలేకపోయారు. ఇది చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదు.