కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి ఇవాళ కోవిడ్ టీకా వేయించుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానాలో ఆయన తొలి డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి దేశవ్యాప్తంగా ఉచిత టీకా పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. దీర్ఘకాల వ్యాధులు ఉన్న 45 ఏళ్లు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇస్తున్నారు. కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రభుత్వ దవాఖానల్లో టీకాలు ఇస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీకా తీసుకునే సమయంలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ కూడా అక్కడే ఉన్నారు. హైదరాబాద్‌లోని భారత్‌బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను ఆయన వేయించుకున్నారు. ఈటల నిన్ననే వ్యాక్సిన్ వేయించుకున్న విషయం తెలిసిందే.
దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ మొదలైంది. ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మిగతా వారిలో వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నట్టు పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారు టీకా కోసం కొ-విన్ 2.0 పోర్టల్, ఆరోగ్యసేతు యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నిన్నటి నుంచే ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇలా చేసుకోలేనివారు వ్యాక్సిన్ కేంద్రాలకు నేరుగా వెళ్లి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.