నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో పుంజుకోవడానికి ఎంచుకున్న ప్రధాన మార్గాల్లో ఒకటి బీజేపీకి దగ్గరవడం. అధికారాన్ని కోల్పోయిన మరుక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. జగన్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే వచ్చే ఇబ్బందులన్నింటినీ ఆయన ముందుగానే ఊహించారు. ఆయన ఊహించినట్టే జరుగుతోంది ఇప్పుడు. ఎమ్మెల్యేలు ఒక్కొకరుగా వెళ్ళిపోతున్నారు. పదవిలో లేని కీలక నేతల మీద అవినీతి ఆరోపణలు, అరెస్టులు జరుగుతున్నాయి. దీన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు కేంద్రం అండ ఉంటే జగన్ ను కొద్దిగా అయినా నిలువరించవచ్చని భావించి బీజేపీతో పొత్తుకు యత్నించారు. కానీ బీజేపీ కలిసేది లేదంటోంది.
నిజానికి బీజేపీ అగ్రనాయకత్వం ఇలిలాంటి పొత్తుల విషయంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందులోనూ అధికారంలో లేని పార్టీ విషయంలో నిర్ణయాలు అంటే పూర్తిగా రాష్ట్ర నాయకత్వానిదే బాధ్యతగా ఉంటుంది. బీజేపీకి రాష్ట్రంలో ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలు చంద్రబాబును బీజేపీ చెంతకు చేరకుండా చేస్తున్నారు. వాళ్ళు అడ్డుపడుతుండబట్టే చంద్రబాబు మాట అమిత్ షా, మోదీల వరకు చేరట్లేదు. ఇంతకీ వారెవరు అనుకుంటున్నారా.. వారే జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోధర్. వీరిద్దరూ మొదటి నుండి చంద్రబాబుకు వ్యతిరేకమే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అంటుంటారు.
ఎప్పుడైతే చంద్రబాబు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొని మోదీని తిట్టిపోశారో అప్పుడే వీరు ఆయన్ను టార్గెట్ గా పెట్టుకున్నారు. అధికారం పోయిన వెంటనే ఇక బాబుగారు అరెస్ట్ కావడమొక్కటే మిగిలుందని అనేవారు. తర్వాత చంద్రబాబే నేరుగా పొత్తు కోసం రావడంతో అవకాశంగా తీసుకుని తమ ప్రతాపం చూపెట్టారు. పొత్తు దిశగా బాబుగారు వేసిన ఒక్క వ్యూహాన్ని కూడ సాగనివ్వలేదు. బీజేపీలో టీడీపీకి మద్దతిదారులు చాలామందే ఉండేవారు. వారిని కూడ ఒక్కొక్కరిగా ఏరివేసే పని మొదలుపెట్టారు. అందులో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షుడి పీఠం నుండి దింపేసి సోము వీర్రాజును కూర్చోబెట్టండంలో కీలక భూమిక పోషించారు. అయినా వీరి పంతం తగ్గలేదు. చూడబోతే ఇంకో రెండు మూడేళ్లు గడిచినా వీరు బీజేపీని చంద్రబాబుతో కలవనిచ్చేలా లేరు.