TV9 : సినీ సెలబ్రిటీలంటే టీవీ9 న్యూస్ ఛానల్‌కి చాలా చులకన. తారల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అనే జబ్బుతో బాధపడుతున్నారు సదరు ఛానల్ యాజమాన్యం, సిబ్బంది.. అనే విమర్శ ఈనాటిది కాదు. చాలామంది తారలు, టీవీ9 ఛానల్ బాధితులుగా వున్నారన్నది నిర్వివాదాంశం.
గతంలో పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డితో ఇదే న్యూస్ ఛానల్ దుష్ప్రచారానికి పాల్పడింద. అప్పట్లో టీడీపీ అనుకూల యాజమాన్యం ఈ సంస్థను నడిపేది. టీడీపీ అనుకూల మీడియాలో టీవీ9 కూడా ఓ భాగం. ఆ తర్వాత యాజమాన్యమైతే మారిందిగానీ, పైత్యం మారలేదు.
మొన్నటికి మొన్న విశ్వక్ సేన్ విషయంలో న్యూస్ రీడర్ దేవి నాగవల్లి, ‘పాగల్ సేన్’ అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదో పెద్ద రచ్చ అయ్యింది. మంత్రులకు యాంకర్ ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. ‘డోన్ట్ కేర్’ అనేశాడు హీరో విశ్వక్ సేన్.
తాజాగా, ‘సర్కారు వారి పాట’ సినిమా థియేటర్లు ఖాళీగా వున్నాయంటూ టీవీ9లో వచ్చిన ఓ కథనంతో, ఓ బూతు హ్యాష్ ట్యాగ్ టీవీ9 పేరుతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘బ్యాన్ టీవీ9’ అనే నినాదం ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తోంది.
మీడియా అంటే, సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం.. రాజకీయ పార్టీల అవినీతిని కడిగి పారేయడం.. వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపడం. అంతేగానీ, ఇదేం పైత్యం.? అన్నది నెటిజన్ల మాట. వివాదాలతో పబ్లిసిటీ పొందాలనుకునే కక్కుర్తి టీవీ9 కొనసాగిస్తోందన్నదే నిజమైతే అంతకన్నా జుగుప్సాకరం ఇంకోటుండదు.