Actress: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరియర్ ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురవడం అన్నది సహజం. కొంతమంది వీటిని ధైర్యంగా ఎదుర్కొంటే మరికొందరు వాటికి భయపడి సినిమా ఇండస్ట్రీకి కూడా దూరం అవుతూ ఉంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలామంది ఒకానొక సమయంలో కొన్ని కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్న వారే. ఇదే విషయాలను పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు హీరోయిన్స్. అలా సినిమా అవకాశాల కోసం వెళితే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో ఉన్నారు.
కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఓటీటీలో అవకాశాలు కావాలి అంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెబుతున్నారు నటి హెల్లీ షా. తనకు ఒక వెబ్ సిరీస్‌లో ఆఫర్ వచ్చిందట కానీ వాళ్లు చెప్పిన కండీషన్‌కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట. ఇదే విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్ లో భాగమయ్యే అవకాశం వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఒక మెసేజ్ వచ్చింది. అది చూడగానే నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాము అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను.
కానీ అంతలోనే.. ఒక కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను. అప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్ లోనే నేను చెప్పింది చేయండి. ఆన్‌లైన్ లో అయినా నాకేం పర్లేదని బదులు ఇచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్‌లైన్ లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్‌లిస్ట్ లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్ ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు హెల్లీ షా. ఇకపోతే ఆమె కెరియర్ విషయానికి వస్తే.. హెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..