ఇన్ని రోజులు అమెరికా అధ్యక్షుడిగా పెత్తనం చెలాయించిన డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి కూరలో కరివేపాకు కంటే దారుణం అయిపోయింది. ఇన్నాళ్లూ ఆయన కన్నెర్ర జేస్తే కిక్కురు మనకుండా ఉన్న సంస్థలు ఇప్పుడు రివర్స్ ఎటాక్స్ ఇస్తున్నాయి. ఎప్పుడు ఈ ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురుచూసిన సంస్థలు… కసి తీరా ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
ఇన్నాళ్లూ అధ్యక్ష పదవి వెలగబెట్టి… అడ్డమైన ట్వీట్లు పెడుతూ… ఎన్నోసార్లు ట్విట్టర్ ద్వారా అభ్యంతరాలు ఎదుర్కొన్న ట్రంప్… ఇప్పుడు శాశ్వతంగా ట్విట్టర్‌కి దూరమయ్యారు. ఆయన ఎకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ట్రంప్ రూల్స్‌ని అతిక్రమించారనీ, అందువల్లే ఈ చర్య తీసుకుంటున్నామని చెప్పింది ట్విట్టర్ యాజమాన్యం.
అమెరికాలో ఏ అధ్యక్షుడికీ ఇంత ఘోర అవమానం జరగలేదని అనుకోవచ్చు. సామాన్యులెవరైనా ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోల వంటివి పోస్ట్ చేస్తే… వాటిని ట్విట్టర్ వెంటనే తొలగిస్తుంది. కానీ… అమెరికా అధ్యక్షుడితోపాటూ… ప్రపంచ దేశాల అధినేతలకు మాత్రం ఈ రూల్ నుంచి మినహాయింపు ఉంది. అందువల్ల వాళ్లు ఏవైనా వివాదాస్పదమైనవి పోస్ట్ చేస్తే… ఆ పోస్టును డిలీట్ చేయకుండా క్లోజ్ చేసి ఉంచుతుంది. ఎవరైనా ట్వీట్ చూడాలనుకుంటే… వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను అడ్డం పెట్టుకొని ట్రంప్… నానా యాగీ చేశారు. అమెరికా క్యాపిటల్ లో జరిగిన ఘర్షణలపై ట్రంప్ జనవరి 8న పెట్టిన ట్వీట్‌పై అభ్యంతరం చెబుతూ ట్విట్టర్ ఆయన అకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది.