ఆమె గెలిచింది.. బీజేపీ – జనసేన బంధం ముగిసినట్లేనా.?

TRS Win, Janasena's Huge Shock To BJP

TRS Win, Janasena's Huge Shock To BJP

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షం భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంది జనసేన పార్టీ.. అదీ తెలంగాణలో. కాదు కాదు, బీజేపీనే.. జనసేనను వెటకారం చేసింది. అదసలు తమకు మిత్రపక్షమే కాదని తేల్చేసింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి విజయం సాధించారంటే, ఆ గెలుపులో జనసేన పాత్ర ఎంతుందోగానీ, బీజేపీకి మాత్రం తగిన శాస్తే జరిగిందని జనసేన పండగ చేసుకుంటోంది. ‘అహంకారంతో విర్రవీగుతున్న బీజేపీకి ఇదొక గుణపాఠం కావాలి..’ అని జనసేన నేతలు, బీజేపీని ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టారు.

జనసేన పార్టీకి సొంతంగా గెలిచే బలం తెలుగు రాష్ట్రాల్లో లేదు. కానీ, ఖచ్చితంగా ఇతర పార్టీల విజయావకాశాల్ని దెబ్బతీయగలదు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే అందులో జనసేన ఓటు బ్యాంకు కీలకం. ఆ విషయం 2019 ఎన్నికల్లో టీడీపీకి తెలిసొచ్చింది. బీజేపీ – జనసేన కలిస్తే ఓటు బ్యాంకు భారీగా వుంటుందన్న అంచనాలతో కమలనాథులు, జనసేన పంచన చేరారు ఏపీ, తెలంగాణల్లో. నిజానికి తెలంగాణలో బీజేపీతో పోల్చితే జనసేన ప్రాబల్యం తక్కువే. అయినా, బీజేపీ తమ గెలుపులో జనసేన పాత్ర వుంటుందనే నమ్ముతోంది. కానీ, జనసేనని చిన్నచూపు చూడటం కమలనాథులకి అలవాటే. జరిగిందేదో జరిగిపోయింది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నాటికైనా బీజేపీ – జనసేన మైత్రి తిరిగి బలపడుతుందా.? లేదా.? అన్నదే కీలకం ఇక్కడ. కానీ, బీజేపీ మాత్రం జనసేనను దూరం పెట్టే ఆలోచనలోనే వుందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోపక్క, బీజేపీ అహంకారాన్ని అణచివేయాలంటే, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సొంతంగా పోటీ చేయాలని జనసేన నాయకులు భావిస్తున్నారట. అదే జరిగితే, దుబ్బాకలో విజయం సాధించిన బీజేపీ, నాగార్జున సాగర్ మీద ఆశలు వదిలేసుకోవాల్సి రావొచ్చు. ఏదిఏమైనా, ‘ఇది మా గెలుపు..’ అని ఏ ఎన్నికలోనూ చెప్పుకోలేక, ఇతర పార్టీల్ని గెలిపించామనో, ఓడించామనో చెప్పుకోవడం వల్ల ఉపయోగముండదని జనసేన పార్టీ అధినాయకత్వం గుర్తెరిగితే మంచిది.