ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి గులాబీ ముల్లు గుచ్చేసుకుంటున్నాయ్

భయంతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఐపీఎస్ అధికారిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చిన విషయం విదితమే. రాజకీయాల్లోకి వస్తూనే, తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపై తన కోరికను బయటపెట్టారాయన. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలన్నది ప్రవీణ్ కుమార్ నినాదం. బహుజనులంటే బానిసలు కాదు, పాలకులవ్వాలంటూ ప్రవీణ్ కుమార్ నినదించడం తెలంగాణ రాష్ట్ర సమితికి నచ్చలేదు. నిజానికి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ ఉద్యమ సమయంలో, దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి..

అన్నారుగానీ, మాట తప్పారు. సరే, రాజకీయాల్లో మాట తప్పడం అనేది చాలా సర్వసాధారణమైన విషయమనుకోండి, అది వేరే సంగతి. ఇక, ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీతో తెలంగాణలో ఎంతవరకు రాజకీయంగా తన ఉనికిని చాటుకోగలరన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో చాలా పార్టీలున్నా, అవేవీ తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రస్తుత పరిస్థితుల్లో బలంగా ఢీకొనలేకపోతున్నాయి. వున్నంతలో బీజేపీ ఒకటే కాస్తో కూస్తో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు వెళుతోంది. కేంద్రంలో అధికారంలో వున్నన్నాళ్ళే బీజేపీ ఈ హంగామా చేయగలుగుతుంది. తన బలమేంటో తెలంగాణ రాష్ట్ర సమితికి తెలుసు. అయినా, ప్రవీణ్ కుమార్ విషయంలో ఎందుకింత అత్యుత్సాహం.? ఆయనపై గులాబీ నేతలు ఎందుకింత దురుసుగా ప్రవర్తిస్తున్నారు.? ఏమోగానీ, ప్రవీణ్ కుమార్ తన స్థాయికి మించిన హంగామా చేస్తున్నారేమోనన్నది మెజార్టీ అభిప్రాయం.