తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్న వైఎస్ షర్మిల ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించి అన్ని పనులు త్వరగా పూర్తి చేస్తూ .. రాష్ట్రంలోని వైఎస్ అభిమానులతో ఆమె జిల్లాల వారీగా ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడా ఆమె భేటీ అవుతూ వారి ఇన్‌పుట్స్ తీసుకుంటున్నారు.
మరోవైపు పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ తెరవెనక ముమ్మరంగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి సంబంధించి తొలి నియామకం చేపట్టారు. తన కార్యక్రమాల సమన్వకర్తగా వాడుక రాజగోపాల్‌ను షర్మిల నియమించారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గానికి చెందిన రాజగోపాల్ వైఎస్ కుటుంబానికి 30 ఏళ్లుగా పరిచయం ఉంది.
ఇక, ఆత్మీయ సమావేశాలకు వచ్చేవారి నుంచి షర్మిల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఫీడ్ బ్యాక్ ఫామ్‌లో పేరు, చిరునామాను నింపడంతో పాటు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో సుమారు 11 ప్రశ్నలు ఉన్నాయి. తాము ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే ఏం చెప్పాలి. రాష్ట్రంలో వైఎస్ఆర్ అభిమానులు ప్రస్తుతం ఎలాంటి కష్టాలు పడుతున్నారు. వాటిని ఎలా తీర్చాలి. మీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటి , అసలు పార్టీ గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్, టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి. రాష్ట్రంలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. ఇక, తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత కేఎస్ దయానంద్.. షర్మిల మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న ఆయన తన పదవికి, టీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు