భాగ్యనగరం .. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మహానగరం. అటువంటి మహానగరంలో ఈ మద్యే జీహెచ్ ఎంసి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో తాము గనక గెలిస్తే… GHMC పరిధిలో మంచినీటిని ఉచితంగా ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజలు ఆ పార్టీకి గెలుపు ఇవ్వడంతో… ఇవాళ్టి నుంచి ప్రభుత్వం మంచినీటిని ఉచితంగా ఇస్తోంది. ఈ పథకం పేరు ఉచిత మంచినీటి సరఫరా. దీన్ని ఇవాళ్టి నుంచి అమలు చేసేందుకు అధికారులు నాల్రోజుల నుంచే అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు.
ఈ పథకాన్నిఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తారు. జూబ్లీహిల్స్‌లోని రహ్మత్‌నగర్ డివిజన్… SPR హిల్స్ లో ఈ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తెలంగాణ మొత్తంలో నీటి వాడకం ఎక్కువగా ఉండేది GHMC పరిధిలోనే. అలాంటి చోట ఉచితంగా మంచినీరును అందించడం అంటే మాటలు కాదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి ఉచితంగా నీరు అందించడం కష్టమైన పనే. 20వేల లీటర్ల లోపు నీరు ఉచితంగా సరఫరా చేస్తామనీ, డిసెంబర్ నెల నుంచి నెల వారీ బిల్లులు ఉండవనీ, గ్రేటర్ పరిధిలో ఉన్న నీటి కనెక్షన్లలో 90 శాతం కనెక్షన్లు ఉచిత నీటి పథకం పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పూర్తిగా నిండిపోయాయి. అందువల్ల రెండేళ్ల వరకు నీటి సరఫరాకి లోటు లేదు. కృష్ణా, గోదావరి నుంచి తరలించే నీటి సరఫరాను కొంత తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంది.