ఈటెల’తో ఎడా పెడా ఆడేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్

TRS, BJP And Congress 'Playing' with Etela Rajender
TRS, BJP And Congress 'Playing' with Etela Rajender
 
ఈటెల రాజేందర్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి చెందిన నేత. తాజా మాజీ మంత్రి.. తాజా మాజీ ఎమ్మెల్యే అయిన ఈటెల, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తిరిగి గెలవాలనే పట్టుదలతో వున్నారు. అప్పుడే అక్కడ ప్రచార కార్యక్రమాలు కూడా షురూ చేసేశారు.
 
అయితే, ఉప ఎన్నిక ఎప్పుడన్నది ఇంకా తేలలేదనుకోండి.. అది వేరే సంగతి. తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పాక ఈటెల రాజేందర్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ‘ఎలాంటి హామీలూ పొందకుండానే ఈటెల బీజేపీలోకి వచ్చారు..’ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెలవిచ్చారు. అంతేనా, ఈటెలకు పదవులు ఇస్తామనే హామీ బీజేపీ అధిష్టానం ఏమీ ఇవ్వలేదనీ సెలవిచ్చారు.
 
అదలా వుంటే, ఈటెల రాజేందర్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ, ఢిల్లీకి పంపించారంటూ తెలంగాణ పీసీసీ తాజా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
 
ఈ ఆరోపణలిప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. బీజేపీ – టీఆర్ఎస్ కలిసి ఆడుతన్న పొలిటికల్ గేమ్.. ఈటెల రాజేందర్ చుట్టూ నడుస్తోందన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ.
 
మరోపక్క, ఈటెల రాజేందర్.. తెలంగాణ రాష్ట్ర సమితిలోనే కొనసాగుతానంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఓ లేఖ రాశారంటోంది గులాబీ దళం.
 
ఈ మేరకు ఓ లేఖని కూడా బయటపెట్టింది. మొత్తమ్మీద, ఈటెల రాజేందర్ పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైందన్నమాట. మూడు పార్టీలూ కలిసి ఈటెల రాజేందర్ పేరుతో బంతాట ఆడేసుకుంటున్నాయ్ మరి.
 
ఇంతకీ, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక తర్వాత ఈటెల రాజేందర్ పరిస్థితి ఏంటి.? ఆయనసలు ఆ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీలోకి దిగుతారా.? చివరి క్షణంలో మార్పులేమైనా వుంటాయా.? మూడు ముక్కల రాజకీయంలో ఈటెల రాజకీయంగా బలిపశువు కానున్నారా.? వేచి చూడాల్సిందే.