ఇప్పటికే వచ్చేయాల్సిన తిరుపతి బై పోల్ ప్రకటన కాస్త ఆలస్యంగా వచ్చింది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుచుకున్న నియోజకవర్గమిది. సిట్టింగ్ ఎంపీ అనారోగ్యంతో కన్నుమూయడంతో ఉప ఎన్నిక తప్పనిసరైంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైసీపీకి పెద్ద కష్టమేమీ కాదు. అయితే, భారతీయ జనతా పార్టీ మాత్రం తిరుపతి ఉప ఎన్నికని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని రాజకీయ పార్టీలకంటే ముందే భారతీయ జనతా పార్టీ తిరుపతి ఉప ఎన్నికపై కసరత్తు మొదలెట్టింది. మరోపక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందు అభ్యర్థిని ఖరారు చేసిన సంగతి తెల్సిందే.
సిట్టింగ్ ఎంపీ కుటుంబానికి అధికార వైసీపీ టిక్కెట్ నిరాకరించడం గమనార్హమిక్కడ. ఇక, తిరుపతిలో జనసేనకు మిత్రపక్షం బీజేపీతో పోల్చితే బలమెక్కువే అయినా, ఓ సామాజిక వర్గం ఈ విషయమై బీజేపీకి అల్టిమేటం జారీ చేసినా, కమలనాథులు మాత్రం తామే పోటీ చేస్తామనీ, మిత్రపక్షం జనసేన మద్దతిస్తుందని ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. దాంతో, తిరుపతి ఉప ఎన్నిక రసవత్తరంగా మారబోతోంది. 2024లో మిత్రపక్షం జనసేనతో కలిసి అధికారంలోకి వస్తామన్నది బీజేపీ ధీమా.
మరి, ఆ స్థాయిలో పుంజుకోవాలంటే, తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ సత్తా చాటి తీరాల్సిందే. కానీ, ఇటీవల జరిగిన పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలో బీజేపీ – జనసేన దారుణ ఫలితాల్ని చవిచూశాయి. టీడీపీ కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయిందిక్కడ. ‘అసలు విపక్షాలకు అభ్యర్థులు దొరకడమే కష్టం..’ అంటూ ‘ఏకగ్రీవం’ సంకేతాల్ని వైసీపీ శ్రేణులు పంపుతున్నాయి తిరుపతి లోక్‌సభకు సంబంధించి. ఇంతకీ, తిరుపతి ఫేట్ ఏమవుతుంది.? వైసీపీ కోటాలోనే తిరుపతి లోక్‌సభ సీటు వుంటుందా.? బీజేపీ సొంతం చేసుకుంటుందా.? అనూహ్యంగా టీడీపీ వైపుకు వెళుతుందా.? వేచి చూడాలి.