Ear Problems: చెవి నొప్పికి చెక్ పెట్టాలంటే ఈ పద్ధతులు పాటించాల్సిందే..!

Ear Problems: శీతాకాలం వచ్చిందంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అటువంటి వాటిలో చెవి నొప్పి సమస్య కూడా చలికాలంలో అధికంగా ఉంటుంది. చెవి నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి ముఖ్యంగా చెవిలో ఇన్ఫెక్షన్ వల్ల చెవి నొప్పి సమస్య మొదలవుతుంది. శీతాకాలంలో జలుబు ,దగ్గు సమస్యలు ఎక్కువగా రావడం వల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. చాలామంది చెవిని శుభ్రం చేసే సమయంలో ఏవేవో పెట్టి క్లీన్ చేయటం వల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. ఏ కారణాల వల్ల అయినా చెవి నొప్పి వచ్చిన బాధ మాత్రం భరించలేని విధంగా ఉంటుంది. చెవి నొప్పి ని నిర్మూలించే పద్ధతుల గురించి తెలుసుకుందాం.

శీతాకాలంలో జలుబు, దగ్గు వచ్చినప్పుడు చెవి నొప్పి సమస్య కూడా మొదలవుతుంది. అందువల్ల మొదట జలుబు ,దగ్గు సమస్యలను నయం చేసుకోవటం వల్ల ఈ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. ఎల్లప్పుడూ చెవిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలా అని చెవిలో కాటన్ బెడ్స్ పెట్టి క్లీన్ చేయడం వల్ల ఇయర్
డ్రమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

జలుబు కారణంగా ముక్కులు మూసుకుపోవడం వల్ల కూడా చెవి నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మొదట ముక్కు ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చెవిని శుభ్రం చేసుకునీ మెత్తని టవల్ లేదా టిష్యూ పేపర్ తో చెవిని రోజు శుభ్రం చేసుకోవాలి.

చెవి నొప్పి ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ గోరువెచ్చగా చేసి రెండు చుక్కలు చెవిలో వేసుకొని రెస్ట్ తీసుకోవాలి. చెవి నొప్పి కి ఆలివ్ ఆయిల్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. చెవి నొప్పి మరీ అధికంగా ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.