ఇంకో ఏడాదిపాటు మూడు రాజధానుల వ్యవహారాన్ని సాగదీయగలమా.? అలా సాగదీస్తే, తదనంతర పరిస్థితులు ఎలా వుంటాయ్.? మూడు రాజధానులపై ప్రస్తుతానికైతే ముందడుగు వేసే పరిస్థితి లేదన్నది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పష్టమైపోయింది.
చంద్రబాబు హయాంలో అమరావతి రాజధానిగా ప్రకటితమైనప్పుడు, అప్పట్లో ఆ రాజధానికి పూర్తి మద్దతివ్వడం.. ఆ తర్వాత మాట తప్పి, మడమ తిప్పడం తెలిసిన విషయాలే. సరే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్న ‘మూడు రాజధానుల’ అంశంలో కొంత ‘మంచి’ లేకపోలేదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులు సాధ్యమయ్యే వ్యవహారం కానే కాదు.
ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మూడు రాజధానుల్ని తాము అమలు చేసేస్తే, ఆ తర్వాత పరిణామాలు ఎలా వుంటాయి.? అన్నదానిపైనా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ స్పష్టత రావడంలేదట. ఇలాగే మూడు రాజధానులపై సస్పెన్స్ కొనసాగిస్తే, ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగ్గలం.? అన్న సందేహం కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది.
పోనీ, రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే.! అది ఇంకో తలనొప్పి. వచ్చే ఏడాది కాలంలో అమరావతిలో రాజధాని కోణంలో అభివృద్ధి అనేది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. మూడేళ్ళ సమయాన్ని వృధా చేసుకోవడం ఇప్పుడు పెద్ద శాపంగా మారుతోంది. అది పార్టీకీ, ప్రభుత్వానికీ పెను శాపమై కూర్చుంది.
ఎలా.? ఇప్పుడెలా.? వైసీపీ అధినేత వైఎస్ జగన్, అత్యంత సన్నిహితులైన వైసీపీ ముఖ్య నేతల వద్ద పదే పదే ఈ విషయమ్మీదనే ప్రస్తావిస్తూ, ఒకింత ఇబ్బంది పడుతున్నారట.-