పాలకులెవరైనాసరే, వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకుని ముందడుగు వేయాల్సి వుంటుంది. ఒక్కోసారి తాము తీసుకునే నిర్ణయాలు, ముందు ముందు అమలు చేయడం కష్టమని భావించినప్పుడు, ఆ నిర్ణయాలపై పునఃసమీక్ష చేసుకోవడం అత్యవసరం.
మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్ సర్కారు కూడా పునరాలోచన, పునఃసమీక్ష చేసుకోవడం మంచిది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మూడు రాజధానుల ఆలోచన అస్సలేమాత్రం సహేతుకం కాదని తేలిపోయింది. రోజులు, నెలలు గడిచిపోతున్నాయ్.. ఏళ్ళు గడిచిపోతున్నా మూడు రాజధానుల వ్యవహారం ముందుకు కదిలే పరిస్థితి కనిపించడంలేదు.
అసలు మూడు రాజధానుల పేరుతో సాధించేది ఏముంటుంది.? మూడు కాకపోతే, ముప్ఫయ్ రాజధానులు కట్టుకోవచ్చు.. కానీ, ఎప్పుడు.? ఒకటంటూ సరైన రాజధాని వున్నప్పుడు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యింది చంద్రబాబు హయాంలో. దాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత వైఎస్ జగన్ సర్కారు మీదనే వుంది.
ఎటూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాసన రాజధాని.. అని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుంటున్నప్పుడు, కొత్తగా వచ్చిన సమస్య ఏముంది.? ఏమీ లేదు. పాత సమస్యే.. నిథుల కొరత. నిధుల సమీకరణ చేపడితే, దాని కోసం తగిన ఆలోచనలు చేస్తే.. అమరావతి, చంద్రబాబు ఆలోచనల స్థాయిలో కాకపోయినా, ఓ మోస్తరు స్థాయిలో రాజధానిగా నిలబడుతుంది.
ఆ తర్వాత విశాఖ అంటారో, కర్నూలు అంటారో, మరొకటి అంటారో.. అది అప్పటి పరిస్థితుల్ని బట్టి ప్రభుత్వంలో వున్నవారి ఇష్టం. అమరావతి పరిరక్షణ సమితి చేయబోతున్న మహా పాదయాత్ర పట్ల సానుకూలత పెరుగుతోందంటే, దానర్థం ప్రభుత్వం ఇలాంటి సందర్భంలోనే.. మూడు రాజధానులపై పునరాలోచన చేసుకోవాలని.