నో డౌట్, జనసేనకు దూరంగా జరగనున్న బీజేపీ

Janasena : భారతీయ జనతా పార్టీకీ, జనసేన పార్టీకీ మధ్య వున్న ‘పొత్తు’ ఎలాంటిదో ఎవరికీ అర్థం కావడంలేదు. జన సైనికులు కావొచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావొచ్చు.. ఇరువురికీ ఈ విషయమై స్పష్టత లేదు. రెండు పార్టీలకు చెందిన నేతలదీ అదే పరిస్థితి. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కెఎ పాల్ తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా‌తో ఢిల్లీలో భేటీ అయి, జనసేన మీద హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో కమెడియన్ అనదగ్గ స్థాయి పాల్‌ది. అయినాగానీ, పాల్, జనసేన మీద విరుచుకుపడినప్పుడు, జనసేనకీ – బీజేపీకీ మధ్య పొత్తు గురించి వెటకారం చేసినప్పుడు.. బీజేపీ, జనసేన నేతలు స్పందించాలి కదా.?

నిజానికి, బీజేపీ నుంచే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాలి. కానీ, రాలేదు. మొన్నీమధ్యనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, ‘మా పొత్తు జనంతో.. అవసరమైతే జనసేనతో..’ అనేశారు. సోము వీర్రాజుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ. అలాంటి సోము వీర్రాజే, ‘అవసరమైతేనే జనసేనతో పొత్తు’ అన్నారంటే రెండు పార్టీల మధ్యా గ్యాప్ పెరిగిందనే కదా అర్థం.?

కెఎ పాల్ ఢిల్లీలో మాట్లాడిన మాటల వెనుక కూడా బీజేపీ పెద్దల హస్తం వుందనే అనుకోవాలి. వ్యూహాత్మకంగానే పాల్ ద్వారా జనసేనకు బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఝలక్ ఇచ్చిందని బహుశా జనసేన నాయకులకీ అర్థమయిపోయే వుంటుంది. టీడీపీ వైపుగా జనసేనాని పయనం బీజేపీ జీర్ణించుకోలేకనే, ఇలా ప్లాన వేసిందని అనుకోవాలి.