గర్భం దాల్చిన మహిళలు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి?

తల్లి కావడం అనేది ప్రతి ఒక్క మహిళకు ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. ఒక బిడ్డకు జన్మనివ్వడానికి 9 నెలలు వారికి ఎంత కష్టం వచ్చినా దానిని ఆనందంగా ఆస్వాదిస్తారు. తన రక్తం పంచుకుని పుట్టే మరొక చిన్ని ప్రాణం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో ప్రతి మహిళ ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొదటి మూడు నెలలు ఏమి తిన్నా వాంతులు, వికారం ఉంటుంది. కడుపుతో ఉన్న మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. తల్లి చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల బిడ్డకు కూడా ఆరోగ్య ప్రమాదం ఉంటుంది. కొంతమంది చాలా ఎక్కువగా తింటుంటారు కొంత మందికి అసలు తినాలనిపించదు. ఎక్కువగా తిన్నవారికి అజీర్తి సమస్యలు ఇంకా తక్కువగా తిన్న వారికి ఎనర్జీ తగ్గిపోవడం జరుగుతుంటాయి. అందువల్ల గర్భిణీ స్త్రీలు తగిన మోతాదులో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

ప్రెగ్నెంట్ గా ఉన్న ఆడవాళ్ళు ఇష్టానుసారం మందులు తీసుకుంటూ ఉంటారు. డాక్టర్ సూచనలు లేకుండా మందులు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ మందులు తీసుకోవడం ద్వారా వాంతులు, కడుపునొప్పి, తల తిరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. గర్భిణులు సరైన చెప్పులు వాడాలి వీటివల్ల పాదాల నొప్పులు , వాపులు రాకుండా జాగ్రత్త గా ఉండవచ్చు.

గర్భిణులు నిద్రించేటప్పుడు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు నిద్రించేటప్పుడు వీలైనంతగా ఒక పక్కకు తిరిగి పడుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. వ్యాయామము మరియు వాకింగ్ చేయడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే అతిగా వ్యాయామం మరియు వాకింగ్ చేయడం కూడా మంచిది కాదు డాక్టర్ సలహా మేరకు మాత్రమే వ్యాయామాలు చేయాలి.