ఎమ్మెల్సీ అభ్య‌ర్ధుల స్క్రూట్నీ పూర్త‌యింది..ముగ్గురు ఖ‌రారు!

ఏపీ శాస‌న‌మండ‌లిలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపీదేవి వెంక‌ట‌ర‌మ‌ణ రాజ్య‌స‌భ‌కు వెళ్లిపోవ‌డంతో ఆ రెండు స్థానాల‌తో పాటు, గ‌వ‌ర్న‌ర్ కోటాలో నామినేట్ అయ్యే రెండు స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ నాలుగు స్థానాల భ‌ర్తీకి సంబంధించి జ‌గ‌న్ స‌ర్కార్ స్పీడ్ పెంచింది. ఆషాఢ మాసం కూడా మ‌రో రెండు..మూడు రోజుల్లో ముగుస్తుంది. అనంత‌రం శ్రావ‌ణ మాసంలోకి ఎంట‌ర్ అవుతాం. ఈ నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ఆ నాలుగు స్థానాల‌కు అభ్య‌ర్ధులతో భర్తీ చేయాల‌ని క‌స‌ర‌త్తులు ముమ్మ‌రం చేసింది. అయితే ఈ నాలుగు స్థానాల్లో పిల్లి సుభాష్ ప‌దవి కాలం ఇంకా 9 నెల‌లే ఉంది.

దీంతో ప్ర‌స్తుతానికి ఆ స్థానాన్ని ప‌క్క‌నబెట్టి మిగ‌తా మూడు స్థానాల ఎంపిక ప్ర‌క్రియ ముందు పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆ స్థానాల్లో అదే సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్దుల్ని ఎంపిక చేయాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో ఆ వ‌ర్గంలోనే ఆశావ‌హుల జాబితా పెద్ద‌దిగానే ఉంద‌ని తేలిసింది. ఫైన‌ల్ గా అంద‌ర్నీ ప‌రిశీలించి స్ర్కూట్నీ ప్ర‌క్రియ పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ దృష్టిలో ఈ ముగ్గురు ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్లు వినిపిస్తోంది. దాదాపు ఈ ముగ్గురు ఖాయ‌మ‌నేని ఆ పార్టీ వ‌ర్గాల్లో సైతం జోరుగా చ‌ర్చ సాగుతోంది. గ‌వ‌ర్న‌ర్ కోటా నుంచి వైసీపీ సీనియర్ నాయ‌కుడు కొయ్య మోషేను రాజు, అలాగే క‌డ‌ప జిల్లా రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ముస్లీం మైనార్టీ మ‌హిళా కార్య‌క‌ర్త జ‌కియా ఖానంని ఎంపిక చేసిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

కొయ్యే మోషేనే రాజుకు గ‌త ఎన్నిక‌ల్లో గోపాల‌పురం నుంచి టెక్కెట్ ఇవ్వాల‌ని భావించారు. కాని చివ‌రి నిమిషంలో స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. దీంతో ఆయ‌న్ని ప‌క్క‌న‌బెట్టాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే మోషేన్ కు ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. జ‌కియా ఖానంకు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని జ‌గ‌న్ ఓదార్పు యాత్ర‌లోనే హామీ ఇచ్చారు. కానీ ఎన్నిక‌ల త‌ర్వాత సాధ్య‌ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడా మాట‌ను నిల‌బెట్టుకుంటున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్. ఈ రెండు గ‌తంలో కూడా బీసీ, మైనార్టీ వ‌ర్గాల నుంచే ఎంపిక చేయ‌డం జ‌రిగింది. ఇప్పుడు అదే సామాజిక వ‌ర్గం నుంచి ఎంపిక చేసేలా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్ కు సిఫార్స్ చేయ‌డం జ‌రిగింది. ఇక మూడ‌వ అభ్య‌ర్ధిగా అంటే మోపీదేవి స్థానంలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శే‌ఖ‌ర్ కు కేటాయించిన‌ట్లు స‌మాచారం.