తెలంగాణ లో అధికారపక్షం-కమలదళాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయిలోనే జరుగుతోంది. రెండు పార్టీల నేతలు ఆరోపణలు-ప్రత్యారోపణలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ సర్కార్ అడ్డంగా దొరికిపోవడంతో బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా సునిశిత విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. అప్పటివరకూ రాష్ర్ట రాజకీయానికే పరిమితమైన అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక మహమ్మారి విషయమై గవర్నర్ తమిళసై సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.
దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పంచ్ పడినట్లు అయింది. అంతకు ముందే జేపీ నడ్డా వ్యాఖ్యలపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కనీసం సంస్కారం అనేది లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మర్కజ్ విషయాన్ని తాము చెప్పే వరకూ కేంద్రం గుర్తించలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. ఈ వేడిలో కి తాజాగా మాజీ ఎంపీ కవిత కూడా ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయానికి దూరంగా ఉన్న కవిత ఎమ్మెల్సీ కోటాలా పోటీకి సిద్ద మవుతున్నారు.
కరోనా నేపథ్యంలో ఆ ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతకు ముందే కవిత బిజేపీ పై ఉద్యమాన్ని ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమానికి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో కవిత కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నారు. సింగరేణి కార్మికుల ఆందోళనలతో కేంద్రం ఒణకాలంటూ పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగే ఉద్యమం గట్టిగా ఉండాలన్నారు. అలాగే జులై 2న సమ్మెకు టీబిజికెఎన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ అనుబంధం టీబీజీకెన్ బలోపేతంపై కవిత దృష్టి సారించారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కవిత ఎంటరవ్వడంతో రాష్ర్ట రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్నారు.