YS Jaganmohan Reddy : జనం మెచ్చిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి.!

YS Jaganmohan Reddy : తెలుగునాట కనీ వినీ ఎరుగని స్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎలా సాధ్యమయ్యింది.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంతటి మెజార్టీ ఎలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకురాగలిగారు.? ఎంతగా చంద్రబాబు పాలనపై వ్యతిరేకత వున్నా, మరీ ఇంతలా వైసీపీకి అంత మెజార్టీని ఎలా ప్రజలు కట్టబెట్టారు.?

‘ఒక్క ఛాన్స్’ అని అడగ్గానే ఓటర్లు గంప గుత్తగా వైసీపీకి ఓట్లేశారనడం సరికాదు. చంద్రబాబు పాలనని చూశారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నమ్మకాన్ని పెంచుకున్నారు. అదే వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, ఎన్నికల ప్రచారం నిమిత్తం విడుదల చేసిన మేనిఫెస్టోకి అధిక ప్రాధాన్యతనిస్తూ, మేనిఫెస్టోలోని హామీల్ని నెరవేరుస్తూ వచ్చారు.

సాధారణంగా మేనిఫెస్టో అంటే, ఎన్నికల్లో గెలవడానికి వినియోగించే ఓ టాయిలెట్ పేపర్ అయిపోయింది చాలా రాజకీయ పార్టీలకి. అధికారంలోకి వచ్చాక, దాన్ని చింపి పారేస్తుంటారు. కానీ, ఇప్పటికీ ఆ మేనిఫెస్టో ప్రకారమే పాలన సాగిస్తుండడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెల్లింది.

కరోనా విపత్తు వేళ రాష్ట్ర ప్రజల్ని ఆదుకున్నది సంక్షేమ పథకాలే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న విమర్శల్లోనూ వాస్తవం లేకపోలేదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి కంటే సంక్షేమానికే పెద్ద పీట వేయక తప్పడంలేదన్నది అధికార వైసీపీ వాదన.

రెండున్నరేళ్ళ పాలనలో ఎన్నో ఎత్తుపల్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూశారు. ప్రభుత్వ జీవోలపై కేసులు, ఆయా నిర్ణయాలకు చుక్కెదురు.. ఇలాంటివన్నీ చాలానే జరిగాయి, జరుగుతూనే వున్నాయి. వ్యూహాత్మక వైఫల్యం, నిర్ణయాలు తీసుకోవడంలో అస్పష్టత.. ఇవన్నీ అధికార వైసీపీని ఇరకాటంలో పడేస్తున్న మాట కూడా వాస్తవమే.

సగం పాలనా కాలం పూర్తయ్యింది. గడచిన రెండేళ్ళలో చేసిన తప్పులు పునరావృతం కాకూడదు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి. ఇక నుంచి విమర్శల తీవ్రత మరింత పెరుగుతుంది. ప్రజల అంచనాలూ ప్రభుత్వమ్మీద ఇంకా పెరిగిపోతాయ్. మరి, ఆ అంచనాల్ని అందుకునేలా ‘మేనేజ్’ చేయగలరా.? పెరిగిన రాష్ట్ర అప్పుల నేపథ్యంలో రాష్ట్రాన్ని ఇకపై ముందుకు నడిపించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎలా సాధ్యపడుతుంది.? వేచి చూడాల్సిందే.