రాజకీయాల్లో వెన్నుపోటుదారులు సర్వసాధారణం. రాజకీయం అంటేనే వెన్నుపోటు అనే స్థాయికి రాజకీయాలు నడుస్తుంటాయి. ఏ పార్టీ కూడా ఈ వెన్నుపోటు రాజకీయాలకు అతీతం కాదు.! ఇప్పుడిదంతా ఎందుకంటే, 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో వున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, సొంత పార్టీలోనే కొందరు వెన్నుపోటు పొడుస్తున్నారనే చర్చ నడుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఖరి.. వైసీపీకి నష్టం చేస్తోందన్నది స్థానికంగా వినిపిస్తోన్న గుసగుసల సారాంశం. మూడు రాజధానుల విషయమై వైసీపీ, ఖచ్చితమైన అభిప్రాయంతో వుంటే, ‘విశాఖ మాత్రమే అసలు సిసలు రాజధాని..’ అంటున్నారు మంత్రి ధర్మాన గత కొంతకాలంగా. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ అనూహ్యంగా కనిపిస్తే, ఆ వేవ్‌లో ధర్మాన కూడా గెలిచారు. శ్రీకాకుళం జిల్లాలో తొలుత ధన్మాన కృష్ణదాస్ మంత్రి అయ్యారు. ఆ తర్వాత ధర్మాన ప్రసాదరావుని మంత్రి పదవి వరించింది. ధర్మాన ప్రసాదరావుతో పోల్చితే, ధర్మాన కృష్ణదాస్‌కి ఒకింత మంచి పేరుంది.
అయితే, సీనియర్ పొలిటీషియన్ అన్న కోణంలో ధర్మాన ప్రసాదరావుకి క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణలో అవకాశం కల్పించారు వైఎస్ జగన్. అప్పటినుంచీ శాఖాపరమైన వ్యవహారాలకు సంబంధించి సెటైర్లు వేస్తూ, అధికార పార్టీని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇరకాటంలో పడేస్తూనే వస్తున్నారు. వైసీపీ పట్ల నిబద్ధత వుందని చెబుతూనే, వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేయడం ధర్మాన ప్రసాదరావు మార్కు రాజకీయంగా చెప్పుకోవచ్చు. విశాఖ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న మంత్రి ధర్మాన, ఉత్తరాంధ్ర సెంటిమెంట్ బాగానే రెచ్చగొడుతున్నారని వైసీపీలో కొందరు అంటోంటే, అదే ఉత్తరాంధ్ర కొంప ముంచేలా వుందనే వాదనా ప్రముఖంగా తెరపైకొస్తోంది.