ఇంట్లో చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్నప్పుడు మనం వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే ఆ పిల్లలకు తెలియకుండా ఏదైనా ప్రమాదకరమైన వస్తువులను ముట్టుకోవచ్చు. చిన్న పిల్లలు నడిచే వయసు,దొగ్గాడే వయసు వచ్చినప్పుడు వారి కంటికి ఏది కనపడితే దానినే ముట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా తాజాగా ఒక పాప తన తల్లి స్నానం చేయించడానికి పెట్టిన వేడినీటిని ముట్టుకొంది. ఆ వేడినీరు పడడంతో తీవ్రంగా ఒళ్ళు కాలిపోయింది. ఆ బాధను తట్టుకోలేక ఆ రెండేళ్ల పాప ప్రాణాలు విడిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని దాసనకొప్పలు అనే గ్రామంలో రాము అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి పెళ్లి అయ్యి రెండేళ్ల వయసున్న పాప కూడా ఉంది.రాము ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తూ రాము భార్యాపాపతో కలిసి సుఖంగా జీవిస్తున్నాడు. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ కావడంతో రాము ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. అందువల్ల రాము భార్య తన పాపను కంటికి రెప్పలా చూసుకుంటు ఇంటి వద్దే ఉంటూ పాప ఆలనాపాలనా చూసుకునేది. అంతే కాకుండా ఆ పాపకు ఇటీవలే రెండవ బర్త్‌డే సెలెబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు.ఇక ఎప్పటి లాగే ఆ చిన్నారి ఆద్యకు స్నానం చేయించేందుకు ఆమె తల్లి సిద్ధమయ్యింది.
అయితే చలికాలం కావడంతో చన్నీళ్లతో స్నానం చేయిస్తే పాప చలికి తట్టుకోలేదని భావించి వేడినీళ్లు కాచింది. ఆ వేడినీళ్లను బాత్రూమ్‌లో పెట్టి చన్నీళ్లు తీసుకొచ్చేందుకు తల్లి అలా వెళ్లింది. అప్పుడు ఇంట్లోనే ఆడుకుంటున్న పాప అవి వేడి నీళ్లని తెలియక బకెట్‌లో చేయి పెట్టింది. కాలడంతో బాధ తట్టుకోలేక చేయి తీసే క్రమంలో బకెట్ ప్రమాదవశాత్తూ పాపపై పడింది. దీంతో ఆ బకెట్‌లో ఉన్న సలసల మరిగే వేడి నీళ్లు పాప శరీరంపై ఒలికాయి. అప్పుడు ఆ పాప ఆ బాధను తట్టుకోలేక పెద్దగా ఏడుస్తూ ఉండటంతో ఏమైందా అని తల్లి చన్నీళ్లు తీసుకుని వచ్చి చూసింది. అప్పటికే ఆద్య కాలిన గాయాలతో విలపించడాన్ని చూసి కన్న తల్లి గట్టిగా కేకలేసింది. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూశారు. ఆ పాప తల్లి కుప్పకూలిపోవడంతో ఆ పాపను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్న పాప కావడంతో ఆ బాధ తట్టుకోలేక గుక్క పట్టి ఏడుస్తూనే ఉంది. మైసూరులోని కేఆర్ హాస్పిటల్‌కు పాపను చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించారు. అప్పటికే పాప శరీరం బాగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ కన్నతల్లి గుండెలవిసేలా రోదించింది.