నిమ్మ‌గ‌డ్డ కేసులో సీఎం జ‌గ‌న్ ముందున్న మార్గాలివే!

ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టులో మ‌రోసారి చుక్కెదురైన సంగ‌తి తెలిసిందే. నేటి ఉద‌య‌మే జ‌గ‌న్ స‌ర్కార్ కి పెద్ద షాకిచ్చింది కోర్టు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై  ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టేసి త‌క్ష‌ణం ఆయ‌న్ని విధుల్లోకి తీసుకోవాల‌ని  ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్ర‌భుత్వం ఉన్న ప‌ళంగా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుంది? అన్న‌ది ఆసక్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి చాలా విశయాల్లో హైకోర్టు మొట్టికాయ‌లు వేసింది. ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, ప్ర‌శ్న‌లు సంధించింది. వాటిలో  ఏ ఒక్క దానికి కూడా ప్ర‌భుత్వం త‌రుపున న్యాయ‌వాదులు స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌లేదు.

ఇక నిమ్మ‌గ‌డ్డ విష‌యం ప్ర‌భుత్వానికి  ప్రెస్టేజ్ ఇష్యూ. జ‌గ‌న్ త‌న‌ని కాద‌ని ర‌మేష్ కుమార్ నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతో ప్ర‌భుత్వం ఆయ‌న్ని సీరియ‌స్ గానే తీసుకుంది. దీంతో ఇరువురు కోర్టు మెట్లు ఎక్కారు. తాజా తీర్పు తో ప్ర‌భుత్వానికి మ‌రోసారి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. దీంతో జ‌గ‌న స‌ర్కార్ ఇప్పుడు ఈ అంశంపై త‌దుప‌రి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంది? ఎలాంటి వ్యూహాల‌తో ముందుకెళ్తుంది  అన్న‌ది ఆస‌క్తిక‌రం. అయితే ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ ముందు నాలుగు దారులున్నాయి. వాటిలో  ఏమార్గాన్ని ఎంచుకుంటున్నారు? అన్న‌దే స‌స్పెన్స్ . హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకు వెళ్ల‌డం. హైకోర్టులో  ప్ర‌భుత్వ వాద‌న‌ల‌కు ప్ర‌తికూలంగా మారిన అంశాల‌ను రివ్యూ చేసుకుని, అవ‌స‌ర‌మైన చ‌ట్టాలు, సెక్ష‌న్లు, క్లాజులు అన్నింటిని ప‌రిశీలించుకుని సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లు  చేయ‌డం.

ఇక రెండ‌వ‌ది కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న్ ని ఇన్వాల్వ్ చేయ‌డం. అయితే ఇదంతా ఈజీ కాదు. సాధార‌ణంగా  స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న్ జోక్యం చేసుకోదు. కేవ‌లం కొన్ని ప్ర‌త్యేక అంశాల విష‌యంలో వివాదాలు త‌లెత్తిన‌ప్పుడు మాత్ర‌మే జోక్యం చేసుకుంటుంది. ఇక మూడ‌వ‌ది ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం. నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వీ కాలం ఇంకా 20 నెల‌లు  ఉంది. ఆయ‌న ఉన్నంత కాలం 50 శాతం రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని సాకుగా చూపించి హైకోర్టులో పిల్ వేసి 20 నెల‌లు పాటు ఎన్నిక‌లు వాయిదా వేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం కొత్త ఈసీని నియ‌మించుకుని ఎన్నిక‌లు నిర్వ‌హించుకోవ‌చ్చు.  

ప్ర‌భుత్వానికి-నిమ్మ‌గ‌డ్డ‌కు  స్థానిక ఎన్నికల‌ విష‌యంలోనే  స‌మ‌స్య త‌లెత్తింది కాబ‌ట్టి దీన్ని మంచి  మార్గంగా చెప్పొచ్చు. ఇక నాల్గ‌వ‌ది సీఎం ఈ విష‌యంలో రాజీ ప‌డ‌టం. అయితే జ‌గ‌న్  నిమ్మ‌గ‌డ్డ‌తో రాజీ  అనేది క‌ల‌లో కూడా జ‌ర‌గ‌ని ప‌ని. కాబ‌ట్టి జ‌గన్ పై మూడు మార్గాల ద్వారా ముందుకెళ్లే అవ‌కాశం ఉంది.  అయితే ఇప్ప‌టికే ప్ర‌భుత్వం న్యాయ‌వాదుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి సుప్రీంకోర్టుకు వెళ్లే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. నిమ్మ‌గ‌డ్డ విష‌యంలో హైకోర్టు నుంచి ఇలాంటి తీర్పే వ‌స్తుంద‌ని ముందే ఊహించి స‌ర్కార్ ప్రీప్లాన్డ్ గానే ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.