దేశంలో ఇప్పటికే కరోనా మహమ్మారి రెండు సార్లు దాడి చేసి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ ఎక్కువ ప్రభావంగా ఎటాక్ చేసి మరింత మందిని బలి చేసుకుంది. మూడో వేవ్ కూడా త్వరలో ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆగష్టు నెల చివరికి మూడో వేవ్ మొదలవుతుందని, ఇది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపెడుతుందని భావిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్ని వ్యాక్సిన్ మాత్రమే కాపాడగలదు. ఈ విషయంలో చాలా దేశాలు మనకన్నా ముందుగానే అప్రమత్తమయ్యి పిల్లల వాక్సినేషన్ పక్రియ జరుపుతున్నారు.
మన దేశంలో పిల్లలపై కోవాక్జిన్ టీకా ట్రయల్స్ ఇటవల కాలంలో మొదలుపెట్టారు.ఈ పక్రియను మూడు దశలుగా నిర్వహిస్తున్నారు. మొదటి దశలో 12-18 సంవత్సరాల వయసు వారిపై నిర్వహించి తరువాత 6-12 వయస్సు పిల్లలపై ,ఆ తరువాత 2-6 వయస్సు వారిపై ట్రయల్స్ జరుపుతున్నారు. ఈ మొత్తం ట్రయల్స్ వచ్చే నెల చివరికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతా అనుకున్నట్లుగా జరిగి సత్ఫలితాలనిస్తే సెప్టెంబర్ నెలలో పిల్లలకి టీకా అందజేస్తారని సమాచారం. చిన్నారులపై కోవాగ్జిన్ టీకా మంచి ఫలితాలనే ఇస్తుందని అంటున్నారు. టీకా అందుబాటులోకి వచ్చేంతవరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.