ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ రీ -ఓపెన్ చేయటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కరోనా ఈ స్థాయిలో ఉంటే స్కూల్స్ ఓపెన్ చేయటం వలన పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉందని తెలిసిన కానీ జగన్ సర్కార్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని అందరు ఆరోపణలు చేస్తున్నారు.
దీనిపై తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ వివరణ ఇస్తూ, స్కూల్స్ విషయంలో ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ ఏడాది హాజరు తప్పనిసరి కాదని తేల్చి చెప్పారు. కరోనా భయాల నేపథ్యంలో పిల్లల్ని స్కూళ్లకు పంపించాలా వద్దా అనే విషయంపై పూర్తిగా తల్లిదండ్రులదే నిర్ణయం అని అన్నారాయన. విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోయినా వారిని పరీక్షలకు అనుమతిస్తామని, పై తరగతులకు ప్రమోట్ చేస్తామని చెప్పారు మంత్రి అవంతి.
ఏపీలో స్కూళ్లు తెరిచే ముందు కొవిడ్ పరీక్షలు చేసిన సమయంలో 829మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులకు కొవిడ్ నిర్థారణ అయింది. అయితే వీరిలో ఎవరికీ స్కూల్ కి రావడం వల్ల కరోనా సోకినట్టు తేలలేదు. కొత్తగా విద్యార్థులెవరూ కరోనాబారిన పడిన దాఖలాలు లేవు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నాయి. స్కూళ్లను తెరిచిన ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నిస్తున్నారు నేతలు.
దీంతో ప్రభుత్వం మరోసారి స్కూళ్ల విషయంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగానే భాగంగానే హాజరు తప్పనిసరి కాదంటూ మంత్రి ప్రకటించారు. గతంలో విద్యాశాఖ మంత్రి ఆదిమలుపు సురేష్ కూడా ఇదే విషయాన్నీ సృష్టం చేసారు, ఇక విద్యార్థుల హాజరు విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.