ఆంధ్రప్రదేశ్ లో పదవతి తరగతి పరీక్షలు నిర్వాహించాలా? వద్దా? అన్న దానిపై ప్రభుత్వం నెల రోజులుగా సీరియస్ గా ఆలోచన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓవైపు కరోనా మహమ్మారి రాష్ర్టాన్ని చుట్టేస్తోన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో భౌతిక దూరం పాటిస్తూ జులై నుంచి పరీక్షలు నిర్వహిస్తామని తొలుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ తర్వాత పరిస్థితులు అంతకంతకు మారిపోయాయి. సడలింపుల నేపథ్యంలో కొవిడ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు పరీక్షలు రద్దు చేస్తేనే మంచిదని సూచనలిచ్చాయి. అన్ని రాజకీయా పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాసాయి. అయితే వాటి గురించి ప్రభుత్వం ఎక్కడా పట్టించుకున్న దాఖలాలేవు.
తాజాగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేసింది. ఇంటర్ ఫెయిలైన విద్యార్ధులందర్నీ పప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా చత్తీస్ ఘడ్, రాజస్థాన్ సహా పలు రాష్ర్టాలు అన్ని రకాల పరీక్షల్ని రద్దు చేసాయి. తరగతి గదుల్లో నిర్వహించిన పరీక్షలు ఆధారంగా పై తరగతులకు పంపిస్తున్నట్లు ప్రకటించాయి.