ఊరికో ఆనందయ్య.. ‘ఏపీ కరోనా’ కొత్త తలనొప్పి.!

Anandayya Medicine

Anandayya Medicine

ప్రపంచ దేశాలు ‘కరోనా వైరస్’కి విరుగుడు కనిపెట్టలేకపోతున్నారు. అత్యవసర వినియోగం కింద కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా, కరోనా సోకినవారికి ఖచ్చితమైన వైద్య చికిత్స కోసం ఇంతవరకు ఎలాంటి మెడిసిన్ కనిపెట్టలేకపోయారు. అయితే, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య మాత్రం తాను తయారు చేసే నాటు మందు, కరోనా వైరస్ మీద బాగా పనిచేస్తుందని అంటున్నాడు.

రకరకాల పరీక్షలు నిర్వహించి, ‘ఆ మందు కరోనా వైరస్ మీద పని చేస్తుందని చెప్పడానికి తగిన ఆధారాల్లేవు. కానీ, దానివల్ల దుష్ప్రభావాల్లేవు గనుక.. మందుని వాడొచ్చు..’ అని రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫై చేసింది.. అదీ హైకోర్టు జోక్యంతో. ఇక, అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. ఊరూ వాడా ఇప్పుడు ఆనందయ్య పేరుతో నాటు మందు దొరుకుతోంది. ఆనందయ్య ఫార్ములా.. అంటూ స్థానిక నాటు వైద్యులు రకరకాల మూలికలతో మందు తయారు చేసి అడ్డగోలుగా అమ్మేస్తున్నారు.

ఆ మందుని స్థానికంగా వున్న కొందరు రాజకీయ నాయకులు పంపిణీ చేస్తుండడం గమనార్హం. అయితే, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో మాత్రమే తాను నాటు మందు తయారు చేస్తున్నాననీ, ఇతర ప్రాంతాల్లో తయారవుతున్న మందుకీ తనకూ సంబంధం లేదని ఆనందయ్య చెబుతున్నారు. అంతేనా, అలా ఫేక్ మందుని విక్రయిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలనీ, లేకపోతే తనకు చెడ్డపేరు వస్తుందనీ ఆనందయ్య వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

అయితే, నాటు మందుకి పేటెంట్ హక్కులుండవు. ఫార్ములా బయటకు వచ్చింది గనుక, ఎవరికి తోచిన రీతిలో వారు తయారు చేసేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాతోపాటు, కడప అలాగే చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆనందయ్య పేరుతో నాటు మందుని.. అధికార పార్టీకి చెందిన నేతలే తయారు చేయించేస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.