పరీక్షల్లేని చదువులు: విద్యార్థుల భవిష్యత్ ఎలా వుంటుందో ఏమో.!

No Exams, What About the Future Of Students?

No Exams, What About the Future Of Students?

కరోనా వైరస్.. విద్యా సంవత్సరాల్ని మింగేస్తోంది. గత ఏడాది పరీక్షల్లేవు.. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది. వచ్చే ఏడాది ఎలా వుంటుందో ఏమో. మూడో వేవ్ తప్పదని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. మరోపక్క, నాలుగో వేవ్.. ఐదో వేవ్ కూడా రావొచ్చంటున్నారు. ఇవన్నీ ఓ యెత్తు.. ఎప్పటికప్పుడు కొత్త మ్యుటెంట్లు వ్యాక్సిన్లను కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి. అసలు భవిష్యత్ ఎలా వుండబోతోంది.? ఫేస్ మాస్కులు లేకుండా జనం రోడ్ల మీద మామూలుగా తిరిగే రోజు వస్తుందా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఆన్ లైన్ చదువులు విద్యార్థులకు సరైన రీతిలో బోధపడటం లేదు. దానికి తోడు, విద్యాభ్యాసం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది కరోనా వైరస్ భయాల కారణంగా. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల నెత్తిన పరీక్షల భారం మోపడం సబబు కాదని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షల్ని కేంద్రం తాజాగా రద్దు చేసింది.

ప్రధాని అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజమే, కరోనా భయాల నేపథ్యంలో విద్యార్థుల్ని చదువు పేరుతో ఇబ్బంది పెట్టడం అనేది అస్సలేమాత్రం సబబు కాదు. కానీ ఎలా.? విద్యార్థులకు పరీక్షల్లేకపోతే.. విద్యాసంవత్సరాలు వృధా అయిపోతోంటే, వారి భవిష్యత్తు ఏమయిపోతుంది.? పోటీ పరీక్షలూ, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఇలా ముందు ముందు చాలా ఇబ్బందులున్నాయి. కానీ, తప్పదు. అంతిమంగా ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. కాబట్టి, ప్రస్తుతానికి విద్యార్థులపై పరీక్షల పేరుతో, చదువుల పేరుతో ఒత్తిడి తీసుకురాకపోతేనే మంచిది. భవిష్యత్తు అంటారా.? అది ముందు ముందు ఎలా వుంటుందన్నది ఇప్పుడే ఊహించి ఓ అంచనాకి రావడం అర్థం పర్థం లేని వ్యవహారమే. ముందైతే ఈ కరోనా గండం నుంచి ప్రపంచం బయటపడాలి.