కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయమై కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో, అందరికీ కరోనా వ్యాక్సిన్ అందడానికి మార్గం సుగమం అవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ వ్యాక్సిన్ల ధరల్ని ప్రకటించడం మొదలు పెట్టాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందిస్తున్న సీరం సంస్థ, ప్రైవేటు ఆసుపత్రులకైతే డోసుకిగాను 600 రూపాయలుగా ధర నిర్ణయించింది. అదే, రాష్ట్ర ప్రభుత్వానికి అయితే 400 రూపాయలకు అందిస్తుందట. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం, ఇప్పుడు ఇస్తున్నట్లే ఇవ్వనుందట.
అంతా బాగానే వుందిగానీ.. కేంద్రానికీ, రాష్ట్రానికీ, ప్రైవేటు ఆసుపత్రులకీ.. ధరల్లో ఎందుకు తేడా.? అన్నదే సామాన్యులకి అర్థం కావడంలేదు. ఇదిలా వుంటే, కొన్ని రాష్ట్రాలు తమ పౌరులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయమై ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నాయి. వ్యాక్సిన్ కొనుగోలు చేసి, అందరికీ ఉచితంగా ఇస్తామని ఇప్పటికీ ఒకటీ అరా రాష్ట్రాలు ప్రకటించేశాయి. మరోపక్క, కేంద్రమే మొత్తం వ్యాక్సిన్ వ్యవహారానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్లూ తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఏర్పడటానికి కారణం, భారతదేశంలో తయారయ్యే వ్యాక్సిన్లను పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ విదేశాలకు ఎగుమతి చేయడమేనని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా, దేశంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా వుంది. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లను ప్రజలకు అందించేందుకు చర్యలు మరింత ముమ్మరం చేస్తే తప్ప, వీలైనంత త్వరగా కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చే అవకాశం వుండదు. వ్యాక్సిన్ ధర విషయంలోనూ కేంద్రం, ప్రత్యేకమైన ఫోకస్ పెట్టితీరాల్సిందే.