Telangana BJP : హస్తిన కమలం పెద్దలతో గులాబీ బాస్ కేసీయార్ సన్నిహిత సంబంధాలే నడుపుతున్నారన్న ప్రచారం ఈనాటిది కాదు. నువ్వు తిట్టినట్లు నటించు.. నేను ఏడ్చినట్లు నటిస్తాను.. అన్నట్లుగా కనిపిస్తుంటుంది బీజేపీ – టీయార్ఎస్ వ్యవహారం. లేకపోతే, కాంగ్రెస్ పార్టీని జీరో చేయగలిగినట్లు, బీజేపీని ఎందుకు గులాబీ పార్టీ తెలంగాణలో చేయలేకపోతోందిట.?
సరే, ఆ విషయాల సంగతి కాస్సేపు పక్కన పెడితే, ఢిల్లీ బీజేపీ నాయకత్వం.. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి దిశా నిర్దేశం చేసింది. ఇకపై, మరింత దూకుడగా గులాబీ పార్టీ మీద విరుచుకుపడండంటూ కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, తెలంగాణ బీజేపీ నాయకులకు స్పష్టం చేశారట.
సీన్ అదిరింది కదూ.! కొత్తగా పోరాటం చేయడానికేముంది.? తెలంగాణ బీజేపీ, గత కొంత కాలంగా గులాబీ పార్టీ మీద పోరాటం చేస్తూనే వుంది. గ్రేటర్ ఎన్నికలొచ్చినప్పుడేమో, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామనీ, కేసీయార్‌ని అరెస్టు చేయిస్తామనీ ప్రగల్భాలు పలికితిరాయె. ఆ తర్వాత సైలెంటయిపోతిరాయె.!
ప్రతిసారీ ఒకటే మాట, కేసీయార్‌ని జైలుకు పంపిస్తామంటూ బీజేపీ నేతలు పాడిందే పాటరా పాచిపళ్ళ డాష్ డాష్ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ‘నన్ను అరెస్టు చేసే ధైర్యముందా.?’ అంటూ కేసీయార్ కూడా రివర్స్ ఎటాక్ చేస్తుంటారు. ఇదంతా నిజమేనని తెలంగాణ సమాజం అనుకోవాలన్నమాట.
ఏడున్నరేళ్ళుగా టీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఈ నాటకం రక్తికడుతోంది. అరెస్టులూ లేవు, ఇంకేమీ లేవు. ఇకపైనా వుండబోవు. కాకపోతే, జనాల్ని వెర్రి వెంగళప్పల్ని చేస్తారంతే.