ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన నాలుగో విడత పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క పంచాయతీని కూడా వైసీపీ టీడీపీ సానుభూతి పరులు దక్కించుకోలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల తో పాటు, మాచర్ల, పుంగనూరు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో టీడీపీ పూర్తిగా జీరోగా నిలిచింది.
వైఎస్ జగన్ కు పులివెందుల తర్వాత గట్టి పట్టున్న నియోజకవర్గం జమ్మలమడుగు. ఇక్కడ వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేని ఆదరణ ఉంది. ఈ స్థానంలో కూడా టీడీపీ జీరో అయ్యింది, కానీ విచిత్రంగా బీజేపీ ఇక్కడ 11 స్థానాల్లో గెలిచామని చెప్పుకుంటుంది. అనంతపురం జిల్లాతో సరిహద్దు పంచుకునే ఈ నియోజకవర్గంలో బీజేపీకి 11 స్థానాలు రావటం ఏమిటి అని అందరు షాక్ కావచ్చు, కానీ ఇక్కడ బీజేపీ సానుభూతి పరులు ఉండటనికి కారణం ఆదినారాయణ రెడ్డి అనే చెప్పాలి.
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి అధికారం జారిపోయిన తర్వాత బీజేపీ పార్టీ అంటూ చెప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడ కొన్ని గ్రామాల్లో ఆదినారాయణ అనుచరులు కొన్ని గ్రామాల్లో గెలవటం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి మద్దతుదార్లు తాము బీజేపీ అని అంటుండటంతో.. అక్కడ బీజేపీ ఖాతాలో కొన్ని పంచాయతీలు పడ్డాయి. అటు ఆదినారాయణ రెడ్డి దూరమై, ఇటు రామసుబ్బారెడ్డి కూడా దూరం కావడంతో.. తెలుగుదేశం పార్టీ జీరో అయ్యింది.