ఆ జిల్లాలో అనాధగా మారిన టీడీపీ.. పార్టీని నడిపించే నాయకుడి కోసం ఎదురుచూపులు.. ఎంత ఘోరం.. ?

TDP

 

రాజకీయాల్లో వైరెటి రాజకీయాలు, ఘాటు రాజకీయాలు అంటూ ఉన్నాయంటే అవన్ని కూడా నెల్లూరు రాజకీయాలే అని అంటున్నారు కొందరు.. ఇక్కడ నెరిపే రాజకీయాల్లో ఎవరి తీరు వారిదే.. సీతయ్య ఎవరి మాట వినరు అనే స్దాయిలో ఎప్పుడు సలసల మరుగుతుంటాయట ఈ నెల్లూరులోని రాజకీయాలు.. నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య భగ్గుమనేలా సాగుతున్న రాజకీయాలకు తోడుగా, అధికార పార్టీలో గ్రూపు తగాదాలకు ఏం కొదువ లేదు.. ఇక సైకిల్ చక్రాలు అన్ని ఊడిపోయి ఒక హ్యాండిల్ మాత్రమే పట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ పరిస్దితి ఈ నెల్లూరూలో మరీ అధ్వాన్నంగా మారిందంటున్నారు విశ్లేషకులు..

ఇప్పటికే అన్నీ జిల్లా కేడర్‌లోని నాయకులు వైసీపీ మెట్లు ఎక్కుతుండగా, రానున్న కాలంలో టీడీపీ పరిస్దితి ఊహించుకుంటే కష్టం అని తెలుస్తుంది.. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధం అని నిందించే వారు లేకపోలేదు.. ఈ పార్టీ ఇలా మారడానికి కారణం బాబుగారే అనే నాయకులు ఎక్కువే ఉన్నారట ఈ పార్టీలో.. ఇకపోతే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉందట. కాకపోతే పార్టీని నడిపించేందుకు బలమైన నాయకుడు లేకపోవడం ఒక సమస్యగా మారిందంటున్నారు ఇక్కడి టీడీపీ వర్గీయులు.. కాగా ఎన్నికలు ప్రకటించిన ప్రతి సారి ఒక కొత్త నాయకుడు రావడంతో పార్టీ కేడర్ చిన్నాభిన్నం అవుతూ వస్తోందని చెబుతున్నారు..

ఇదిలా ఉండగా ఆత్మకూరు నుంచి ప్రస్తుత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పై 2014 ఎన్నికల్లో కన్నబాబు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో టీడీపీ, గౌతమ్‌రెడ్డిపై, బొల్లినేని క్రిష్ణయ్యనుబరిలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. దీనిఫలితంగా ఓటమి తర్వాత క్రిష్ణయ్య ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని టాక్‌. ఇకపోతే ప్రస్తుతానికి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ ఇన్‌చార్జి కూడా కరువయ్యారట.

ఇక గత ఎన్నికల ముందు హడావుడి చేసిన చాలామంది నాయకులు ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారు. ఈ నియోజక వర్గంలో పార్టీ బలంగా వున్నా నాయకులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటేనే పార్టీకి భవిష్యత్‌ ఉంటుందనేది ఇక్కడి కార్యకర్తల అభిప్రాయమట. ఇదంతా జరగాలంటే స్థానికంగా ఉండే వారికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని వారు పేర్కొంటున్నారట..