TDP Vs YCP: టీడీపీ వర్సెస్ వైసీపీ: గాడిదలు కాసిందెవరు.? కాస్తున్నదెవరు.?

YSRCP and TDP flags

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ అత్యంత పతనావస్థకు దిగజారిపోతున్నాయి. దిగజారడంలో సరికొత్త లోతుల్ని కనుగొంటున్నారు రాజకీయ నాయకులు. అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ.. ఈ రెండూ ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. రాయలసీమలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అన్నమయ్య డ్యామ్ ఇటీవలి వరదల్లో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ డ్యామ్ విషయమై వైసీపీ వర్సెస్ టీడీపీ పెద్ద రాజకీయ రచ్చ నడుస్తోంది.

డ్యామ్ నిర్వహణ వైఫల్యమే ఈ దారుణానికి కారణమని కేంద్రం తేల్చి చెప్పింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇదంతా జరిగిందన్నది కేంద్రం వాదన. దాంతో, టీడీపీకి మరింత బలం వచ్చింది వైసీపీ మీద విమర్శలు చేయడానికి.

కాగా, 2017లోనే కొత్త స్పిల్ వే కట్టాల్సిందిగా సూచనలు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందనీ, చంద్రబాబు హయాంలో ప్రదర్శించిన నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రస్తుత జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ‘చంద్రబాబు పాలనలో గాడిదలు కాశారా.?’ అంటూ మండిపడ్డారాయన.

అయితే, 2019లో చంద్రబాబు పాలన ముగిసింది. 2019 నుంచి రెండున్నరేళ్ళగా వైసీపీనే అధికారంలో వుంది. ఆ లెక్కన, గతంలో చంద్రబాబు గాడిదలు కాస్తే, ఇప్పుడు గాడిదలు కాస్తున్నదెవరు.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కార్నర్ చేయడానికే మంత్రి అనిల్ కుమార్ ఇలాంటి అడ్డగోలు వాదనలు తెస్తున్నారేమోనన్న అనుమానం వైసీపీ అభిమానులకు కలుగుతోంది.

టీడీపీ అధికారం కోల్పోయి రెండున్నరేళ్ళయినా, చీటికీ మాటికీ ఇంకా చంద్రబాబు పేరు తీసుకురావడం వల్ల వైసీపీ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతున్న విషయం మంత్రులకు.. మరీ ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి ఎందుకు అర్థం కావడంలేదో ఏమో.!