టీడీపీ వర్సెస్ జనసేన.! పొత్తుల పంచాయితీలో గెలుపెవరిది.?

తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవాలా.? పెట్టకోకూడదా.? జనసైనికులైతే, ‘పొత్తు వద్దే వద్దు..’ అని తెగేసి చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదంటే, జనసేన పార్టీతో టీడీపీ కలవాలి.. లేదంటే, టీడీపీతో జనసేన కలవాలి.. ఇదీ రాజకీయ ఈక్వేషన్.!

అసలు టీడీపీతో సంబంధం లేకుండా కూడా, జనసేన పార్టీ సొంతంగా సత్తా చాటితే, వైసీపీ వ్యతిరేక ఓటు ఎందుకు చీలిపోతుంది.? ఆ ఓటు బ్యాంక్ అంతా జనసేనకు వచ్చేలా జనసేనాని ఎందుకు చేయకూడదు.? పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే సత్తా చాటింది కదా.?

తెలుగునాట రాజకీయ పరిస్థితులు వేరు. ఔను, నిజ్జంగా నిజమిది. తెలుగు నేలపై.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు నడుస్తుంటాయి. అదే అసలు సమస్య. ఇంతలా కుల రాజకీయాలు నడుస్తున్నా, రెండు కులాలకు తప్ప, జనాభాలో అధిక శాతం వున్న మిగతా కులాలకు మాత్రం అధికారం దక్కదుగాక దక్కదు. అదే అసలు సమస్య.

సరే, ఈ రాజకీయాల ఎప్పుడూ వుండేవే. కార్పొరేషన్లనీ, నామినేటెడ్ పదవులనీ.. మెజార్టీ జనాభా వున్న కులాల్ని వంచించడం, ప్రధాన రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. అంతెందుకు, 50 శాతం రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చాం.. అని చెప్పుకుంటోంది వైసీపీ. మరో యాభై శాతం సీట్లు తమ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నట్లు చెప్పగలరా.? లేదే.!

ఇలాంటి రాజకీయాలన్నిటినీ దాటి జనసేనాని, ‘మర్పు కోసం’ అంటూ ప్రజల్లోకి వెళ్ళి ఉపయోగం లేదు. అందుకే, టీడీపీతో పొత్తు అవసరం అన్నది కొందరి భావన. జనసైనికులు మాత్రం ససెమిరా అంటున్నారు. మరి, జనసేనాని ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.