బీజేపీలో టీడీపీ కలిసిపోతుతందా.? నిజమెంత.!

TDP To Merge With BJP Soon?

TDP To Merge With BJP Soon?

భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ కలిసిపోతుందట. ‘విలీనం’ చర్చలు కూడా జరిగాయట. ఇదంతా ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన ఏప్రిల్ ఫూల్ కథనం తాలూకు సారాంశం. దీనిపై తెలుగుదేశం పార్టీ గుస్సా అయ్యింది. జర్నలిజం విలువలకి తిలోదకాలిచ్చేసిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సోషల్ మీడియా వేదికగా. అయితే, దీన్ని ఏప్రిల్ ఫూల్ కథనంగా కాకుండా, ఓ మామూలు కథనంగా ప్రచురించి వుంటే ఇంత రాద్ధాంతం జరిగి వుండేది కాదేమో. వాస్తవానికి, చంద్రబాబు ముందుకు విలీనం ప్రతిపాదన గతంలోనే బీజేపీ తెచ్చిందంటారు చాలామంది.

ఆ లెక్కలు కుదరకపోవడం వల్లే బీజేపీ – టీడీపీ మధ్య చెడిందన్నది ఓ ప్రచారం. ఇందులో నిజమెంత.? అన్నది వేరే చర్చ. అయితే, తెలుగు నాట బీజేపీతో పోల్చితే తెలుగుదేశం చాలా బలమైన పార్టీ. కానీ, అది ఒకప్పుడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకత్వ లేమితో సతమతమవుతోంది. అలాగని బీజేపీలో టీడీపీ కలిసిపోతే, బీజేపీ.. రాష్ట్రంలో బలపడుతుందా.? అంటే అదీ లేదు. ఆ విషయం బీజేపీకి అర్థమయ్యాకనే, జనసేనతో పొత్తు పెట్టకుంది. అయినాగానీ, ఏపీలో బలపడేందుకు టీడీపీనే తమకు అవసరమని బీజేపీ ఇంకా లోలోపల భావిస్తూనే వుంది. అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇద్దరి మధ్యా అహం అడ్డంకిగా మారుతోంది. లేదంటే, బీజేపీలో టీడీపీ కలిసిపోవడమో.. బీజేపీ – టీడీపీ కలిసి పనిచేయడమో జరిగేవే. ఏం చేసినా ఏపీలో బలపడలేమని బీజేపీకి అర్థమయ్యిందేమో.. ఇంకోసారి టీడీపీతో చర్చలు జరుపుతోందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఈ మధ్య బలంగా వినిపిస్తున్నాయి. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. విలీనం.. అనేది అంత తేలికైన వ్యవహారం కాదు. ఆ పరిస్థితులూ కనిపించడం లేదు. కానీ, బీజేపీ – టీడీపీ కలిసే అవకాశాలైతే వున్నాయ్.