టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్. దాదాపు 14 ఏళ్ళ పాటు (ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తొమ్మిదేళ్ళు, 13 జిల్లాల ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ళు) ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబు సొంతం. ప్రతిపక్ష నేతగా కూడా సుదీర్ఘ కాలం పనిచేశారాయన.. ప్రతిపక్ష నేతగానే కొనసాగుతున్నారిప్పుడు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని ప్రధాన ప్రతిపక్ష నేత బాయ్‌కాట్ చేయడం ఎంతవరకు సబబు.? అన్న విషయమై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో వైఎస్సార్సీపీ కూడా అసెంబ్లీ సమావేశాల్ని బాయ్‌కాట్ చేసింది. అది కూడా సమర్థనీయం కాదు. రాజకీయ నాయకుల్ని ప్రజా ప్రతినిథులుగా మార్చి, చట్ట సభలకు పంపేది ఎందుకు.? చట్ట సభల్లో ప్రజల తరఫున మాట్లాడేందుకే కదా.. మరి, అలాంటప్పుడు ప్రతిపక్షం తన బాధ్యతల్ని విస్మరించి అసెంబ్లీ సమావేశాల్ని బాయ్‌కాట్ చేశామని ప్రకటించడం ఏ నైతిక విలువలకు నిదర్శనం.? కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేస్తున్నాం.. అన్న టీడీపీ వాదనను సమర్థించలేం. అదే సమయంలో, ఒక్కరోజేనా బడ్జెట్ సమావేశాలు.? అన్న ప్రశ్నపైనా టీడీపీ అభ్యంతరాల్ని సమర్థించలేని పరిస్థితి వుంది.
కరోనా కారణంగానే బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి.. ఇప్పుడు ఒకే రోజు జరిగేందుకు రంగం సిద్ధమయ్యింది కూడా. ఎక్కువ రోజులు సభ నడపాలని టీడీపీ డిమాండ్ చేయొచ్చు. కానీ, అప్పట్లో వైసీపీ బాయ్‌కాట్ చేసింది కాబట్టి, ఇప్పుడు తామూ అదే పని చేస్తామని టీడీపీ అంటే, చంద్రబాబు తాను సీనియర్ పొలిటీషియన్.. అని చెప్పుకోవడమెందుకు దండగ కాకపోతే. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. వాటిని అడ్రస్ చేయాల్సింది ప్రతిపక్షమే. జూమ్ మీటింగుల్లోనో, న్యూస్ ఛానళ్ళలోనో కన్పించి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోదు. చట్ట సభల సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఆ సదవకాశాన్ని టీడీపీ కోల్పోతోంది.