బస్తీ మే సవాల్.. రాజీనామాలకు సిద్ధమంటున్న టీడీపీ.!

‘ప్రభుత్వాన్ని రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా.?’ అంటూ అధికార వైసీపీకి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సవాల్ విసురుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాకి సిద్ధమైతే, తమ ఎమ్మెల్యేలూ రాజీనామాకి సిద్ధమన్నది తెలుగుదేశం పార్టీ తాజా సవాల్.

ఇదెక్కడి వింత.? వైఎస్ జగన్ సర్కార్ ఎందుకు ముందస్తుగానే, ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది.. ఛాన్సే లేదు. కానీ, వున్నపళంగా అదికార పీఠమెక్కేయాలన్న కక్కుర్తి తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.

అయినా, జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బ తగులుతోంటే, ఇంకా ఏ ధైర్యంతో ‘మళ్ళీ ఎన్నికలకు వెళదాం.?’ అని టీడీపీ అడుగుతున్నట్టు.? ఎక్కడా వైసీపీకి గట్టి పోటీ ఇవ్వలేని దయనీయ స్థితిలో టీడీపీ వుంది.

కాస్తో కూస్తో జనసేన పార్టీ పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది.. సో, టీడీపీ గనుక సాధారణ ఎన్నికల డిమాండ్ తెరపైకి తెస్తే, వైసీపీ గనుక ఆ డిమాండ్‌కి తలొగ్గితే.. కాస్తయినా లాభపడే పార్టీ జనసేన మాత్రమే. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్నంతమంది ఎమ్మెల్యేలు కూడా ముందు ముందు వుండకపోవచ్చు.

ఇక, అధికార వైసీపీ సంగతంటారా.? అధికారం మళ్ళీ వైసీపీకే దక్కుతుంది.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా. పైగా, ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశమే వుంది. ఇవేవీ నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబుకి తెలియవనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

వైసీపీని పడగొట్టాలని కాకుండా, టీడీపీని ఇంకా నాశనం చేసెయ్యాలనే కోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలు కనిపిస్తున్నాయని.. గత కొంతకాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.