టీడీపీ నిజ నిర్ధారణ: వైసీపీకి ఎందుకంత ఉలికిపాటు.?

శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న అనుమానంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీడీపీ నేతల్ని నిలువరించడం.. అనే ప్రక్రియను తప్పు పట్టలేం. అయితే, అసలు వైసీపీ సర్కార్, టీడీపీ నిజ నిర్ధారణ వ్యవహారంపై ఎందుకంత ఆందోళన చెందడం.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి, చాలా చిన్న విషయమిది. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్ సహా ఇతరత్రా తవ్వకాలు జరుగుతున్నాయన్నది టీడీపీ ఆరోపణ. వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ మీదనే టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఇదే వ్యవహారానికి సంబంధించి దేవినేని ఉమ, ఆ ప్రాంతానికి వెళ్ళడంతోనే అసలు సమస్య మొదలైంది. దేవినేని ఉమపై ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు. వాటితోపాటు, అట్రాసిటీ కేసులూ నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ ఏకంగా నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఆ కమిటీ ఈ రోజు, వివాదాస్పద ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమయ్యింది. ఆ ప్రాంతంలో పర్యటనలు చేయకూడదన్న ఆంక్షలైతే లేవు. ప్రతిపక్షం గనుక, ఏదో ఒక అంశం పట్టుకుని యాగీ చేయాలనుకోవడం వింతేమీ కాదు. కొండని తవ్వి ఎలకని పట్టిన చందాన, టీడీపీ నిజనిర్ధారణ కమిటీ చేసేదేమీ వుండదు. కానీ, ఈ ముసుగులో టీడీపీ ‘అతి’ చేస్తే, ఆ తర్వాత పరిస్థితులు అదుపుతప్పుతాయని అధికార వైసీపీ భావించి వుండొచ్చు. లేదంటే, టీడీపీ చేయబోయే యాగీతో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులైనా ప్రభుత్వానికి అంది వుండొచ్చు. పెద్దయెత్తున నేతలు, కార్యకర్తల్ని వెంటేసుకుని, నిజనిర్ధారణ పేరుతో టీడీపీ హంగామా చేయాలనుకుంటున్నప్పుడు వారిని నిలువరించడం పోలీసుల విధి. అయితే, ఇక్కడ వారిని నిలువరించడం ద్వారా, అధికార పార్టీ ఏదో తప్పు చేస్తోందన్న భావన అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది.