ఆంధ్రప్రదేశ్ లో ప్రజా పాలన కంటే కూడా కక్ష్యపూరిత రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయని చాలా రోజుల నుండి రాజకీయ విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. ఈ మాటలను నిజం చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఆ ఇబ్బందులను భరించలేక ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైసీపీ బాట పడుతున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ వైసీపీ చెంతకు చేరి చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ కూడా త్వరలో వైసీపీలోకి వెళ్తున్నాడని వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
వైసీపీకి షాక్ ఇచ్చిన అశోక్
ఇచ్చాపురంలో టీపీడీ పట్టు ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఏడు సార్లు గెలిచింది. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తాకిడికి కూడా తట్టుకొని అశోక్ అక్కడ టీడీపీ తరపున విజయం సాధించారు. అయితే విశాఖకు పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఆయన కూడా వైసీపీకి వెళతారని ప్రచారం జరిగింది. గత కొద్ది నెలలుగా మౌనంగా ఉండటం వల్ల ఆయన పార్టీ మారడం ఖాయమని కూడా పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి తెరదించుతూ బెందాళం అశోక్ తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీని వీడే ఉద్దేశ్యం లేదని చెప్పారు.
జగన్ కు చుక్కలు చూపిస్తున్నారు
వైసీపీలోకి వస్తాడనుకున్న అశోక్ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తుందని, అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ రాజధానిని మార్చాల్సి వస్తే శ్రీకాకుళంను రాజధాని చెయ్యాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేవలం రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడుకు క్రెడిట్ దక్కకూడదన్న కారణంతోనే రాజధానిని మార్చడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.