వీవీఐపీ సేవలో తరిస్తున్న టీడీపీ.! మంత్రుల పర్యాటక కేంద్రమా.?

తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమవుతోందన్న విమర్శలు ఈనాటివి కావు. రాజకీయ నాయకుల రాజకీయ యాత్రలతో తిరుమల ప్రతిష్టకు భంగం కలుగుతోందని గతంలోనూ విమర్శలొచ్చాయి.. ఇప్పుడు అవి మరింత ఘాటుగా వినిపిస్తున్నాయి.

రాజకీయ నాయకులంటూ బోల్డంత హంగామా వుండాలి. అనుచరులతో కలిసి షో చెయ్యాలి. దేవుడి ముందనాసరే, ఈ షో తప్పనిసరి. మంత్రులు తమ వెంట ప్రోటోకాల్ ప్రకారం అత్యం సన్నిహితుల్ని, కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్ళడం కొత్తేమీ కాదు. కానీ, ప్రోటోకాల్ పరిధి దాటి మరీ, పెద్ద సంఖ్యలో అనుచరుల్ని వెంటేసుకుని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళుతుండడమే అసలు సమస్య.

పెద్ద సంఖ్యలో మంత్రులు తమ వెంట అనుచరుల్ని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తీసుకెళుతున్న వైనాన్ని ఎవరు బయటపెడుతున్నారు.? అన్నది ఇంకో చర్చ. ‘వైసీపీ నేతలే ఈ విషయాల్ని లీక్ చేస్తున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారు..’ అంటూ జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేయలేం.

మొన్న సీదిరి అప్పల రాజు, నిన్న ఉష శ్రీ చరణ్, తాజాగా రోజా.. ఇలా మంత్రుల తిరుమల పర్యటన వివాదాస్పదమవుతుండడం చిన్న విషయం కాదు. అసలు దేవుడి ముందర రాజకీయ నాయకులు ఎందుకిలా బలప్రదర్శన చేయాలి.? అసలు దేవుడి ముందర వీఐపీలేంటి.? వీవీఐపీలేంటి.? సామాన్యులేంటి.? అదంతే.. అలా జరుగుతుందంతే.!

రాను రాను తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పర్యాటక కేంద్రంగా మారిపోయిందని భక్తులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకుల్నే కాదు, అసలంటూ రాజకీయ నాయకుల్ని కట్టడి చేయాలన్నది భక్తుల డిమాండ్. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.?