అధికార పార్టీ మీద విమర్శలు చేయాలని, వారిని దోషులుగా నిలబెట్టాలనే తపనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిన్నా చితకా విషయాలను కూడ భూతద్దంలోంచి చూస్తూ మాట్లాడేస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఏకిపారేద్దామా అనే ఆలోచనతో గోరుతో పొయ్యే దానికి గొడ్డలి పట్టుకొస్తున్నారు. సోషల్ మీడియా ఒకటి దొరికింది కదా అని అదే ప్రతి చిన్న విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు బాబుగారు. తాజాగా విశాఖలో సబ్బం హరి ఇంటి గోడను మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణమని కూల్చేశారు. అలాగే విజయవాడలో టీడీపీ నేత పట్టాభి కారు అద్దాలను ఎవరో రాత్రి పగులగొట్టేశారు. అంతే చంద్రబాబు రంగంలోకి దూకేశారు.
వైఎస్ జగన్ కావాలనే కక్ష కట్టి సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను అధికారులతో కూలగొట్టించారని, అలాగే 108 అంబులెన్సుల్లో జరిగిన అవినీతిని బయటపెట్టినందుకు పట్టాభి కారు అద్దాలను రౌడీ మూకల చేత పగలగొట్టించారని అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అంతేనా గోడను కోల్పోయిన సబ్బం హరికి, కారు అద్దాలు నష్టపోయిన పట్టాభికి తాము అండగా ఉంటామని ఒక భరోసా మంత్రం వదిలారు. అసలు ఈ రెండు ఇన్సిడెంట్స్ చూస్తే చంద్రబాబు స్థాయి వ్యక్తి అంత తీవ్రంగా స్పందించాల్సిన ఘటనలే కాదు. వాటి మీద ఫైట్ చేయడానికి లోకల్ లీడర్లు చాలామందే ఉంటారు. మామూలుగా అయితే వాళ్లే బయటికొచ్చి మాట్లాడి ఏదైనా హడావుడి చేస్తారు. కానీ చిత్రంగా బాబుగారే బయటికొచ్చారు.
అసలు రాష్ట్రంలో ఏ సమస్యా లేనట్టు ఇవే పెద్ద విషయాలైనట్టు చంద్రబాబు ఆయన వెంటే లోకేష్ మాట్లాడటం కాస్త వింతగానే ఉంది. ఇలా చిన్న చిన్న విషయాలకు కూడ అధినేత బయటికొచ్చి వాటిని తలకు రుద్దేసుకుంటే ఆయన మాటలకు, విమర్శలకు స్థాయి ఉంటుందా ? అమరావతి, మూడు రాజధానులు, ప్రభుత్వ ఇతర నిర్ణయాలు, పెరుగుతున్న అప్పులు, న్యాయవ్యవస్థల మీద విమర్శలు, ఎమ్మెల్యేల జంపింగ్, వైసీపీ మంత్రుల దూకుడు మాటలు, ఆలయాల మీద దాడులు ఇలా ఆయన స్థాయికి తగ్గ సమస్యలు బోలెడున్నాయి. ఏదైనా మాట్లాడితే వాటి మీద మాట్లాడి ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలి కానీ ఇలా గోడలు కూలాయి, అద్దాలు పగిలాయి ఇదిగో నా భరోసా అంటుండటం, ఆయన మాటలతో చిన్న విషయాలు పెద్దవైపోయి ప్రధాన సమస్యలు పక్కదారి పట్టిపోతుండటం టీడీపీ శ్రేణులకు సైతం నచ్చట్లేదు. కానీ ఏం చేస్తారు.. బయటపడలేక లోపలే నిటూర్పు వ్యక్తం చేసుకుంటున్నారు.