వైఎస్ జగన్ చాపకింద నీరులా అనుసరిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ విధానం తెలుగుదేశం పార్టీని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారు. వీరిలో ఎవ్వరూ టీడీపీకి రాజీనామా చేయలేదు కానీ అనధికారికంగా వైఎస్ జగన్ పక్షానికి మారిపోయారు. ఇంకా గంటా శ్రీనివాసరావు, గణబాబు లాంటి ఎమ్మెల్యేలు సైకిల్ దిగడానికి క్యూలో ఉన్నారని అంటున్నారు. వారు కూడ ఇంకో నెల రోజుల్లో చంద్రబాబుకు షాక్ ఇవ్వొచ్చనే టాక్ నడుస్తోంది. దీంతో చంద్రబాబు మిగిలి ఉన్న నేతలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ బుజ్జగించే పని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
వారిలో కొందరు చంద్రబాబు మాటలకు కరివిపోయి పార్టీ మారే ఆలోచనను విరమించుకుంటే ఇంకొందరు మాత్రం ససేమిరా పార్టీలో ఉండేది లేదని అంటున్నారట. కొన్ని రోజుల క్రితం కింజరపు ఫ్యామిలీ మొత్తం ఒకేసారి టీడీపీని వీడనున్నారనే ప్రచారం జరిగింది. టీడీపీకి శ్రీకాకుళం జిల్లాలో కింజరపు కుటుంబం తొలి నుండి అండగా ఉంటూ వచ్చింది. ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానీ ఇలా కింజరపు కుటుంబం మొత్తం దశాబ్దాలుగా టీడీపీ జెండా మోస్తున్నారు. చంద్రబాబు సైతం వారి కుటుంబానికి మంచి ప్రాధాన్యం, అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఏనాడూ పార్టీకి, కింజరపు కుటుంబానికి తేడాలు రాలేదు.
కానీ ఈమధ్య జరిగిన అచ్చెన్నాయుడు అరెస్టుతో ఇరువురికి నడుమ కొంత అలజడి క్రియేట్ అయిందనే సంకేతాలు వచ్చాయి. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్టయితే ఆయన్ను విడిపించడంలో చంద్రబాబు సరైన శ్రద్ద పెట్టలేదని, అందుకే ఆయన రెండున్నర నెలలకు పైగా కస్టడీలో ఉండాల్సి వచ్చిందని కింజరపు కుటుంబం నొచ్చుకుందని దీంతో రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానీ ఇద్దరూ పార్టీని వీడాలని అనుకున్నారని, అచ్చెన్నాయుడు సైతం సైకిల్ దిగాలని అనుకుంటున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత అవేవీ నిజం కాదని, కింజరపు కుటుంబం టీడీపీతోనే ఉందని తేలింది. దీంతో కంగారుపడిన తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకుని చంద్రబాబుకు అండగా కింజరపు ఫ్యామిలీ అయినా పార్టీలో మిగిలి ఉందని అనుకుంటున్నారు.