కరోనా సెకండ్ వేవ్ ధాటికి భారత్ చిగురుటాకులా వణికిపోతోందన్నది నిజం. ఎన్నో దేశాలు సాయం చేస్తామంటున్నాయి. ప్రధాని మోదీ నిరంతర సమీక్షలు, చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఈసమయంలో ప్రభుత్వానికి సలహాలివ్వాల్సిన కొన్ని పార్టీలు విషయాన్ని రాజకీయం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోదీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. చంద్రబాబు అధికారంలో లేకపోవడం వల్లే దేశానికి ఈ దుస్థితి పట్టిందనేట్టుగా వారి పోస్టులు ఉన్నాయి. గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా చంద్రబాబుకు పేరు ఉంది. అయితే.. చంద్రబాబు మాత్రమే అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా? ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలు కొందరు చేస్తోంది ఇదే.
కరోనా కట్టడికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో సీఎం జగన్ కూడా చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే.. టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ఎలా ఉందంటే.. ప్రస్తుత భారత్ పరిస్థితి చూసి.. డబ్ల్యూహెచ్ఓ, ఐక్యరాజ్యసమితి సభ్యులు చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై.. దేశంలో కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకోవాలి? అని అడిగినట్టు.. ఇందుకు చంద్రబాబు సలహాలిచ్చినట్టు వారి గ్రూపుల్లో వారే పోస్ట్ చేసుకుంటున్నారు. ప్రధానిగా తనను దాటి అంతర్జాతీయ వేదిక.. అధికారం లేని చంద్రబాబు దగ్గరకు వెళ్లడంతో మోదీ బిత్తరపోయి చంద్రబాబు కోసం పాకులాడినట్టు తయారు చేసుకున్నారు. చంద్రబాబే ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని.. కూడా పోస్టులు చేసుకుంటున్నారు. గతేడాది కూడా చంద్రబాబు ఉండుంటే.. అనే మాటనే పబ్లిసిటీ చేసుకున్నారు.
కానీ.. ఆయన లేకుండానే దేశం కరోనాను ఎదుర్కొంది. రాష్ట్రం కరోనా టెస్టుల్లో దేశంలో ముందుంది. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు ఓ సందర్భంలో ప్రస్తావించింది. పవన్ కల్యాణ్ కూడా ఏపీ ప్రభుత్వం చర్యలను మెచ్చుకున్నారు. మరి.. చంద్రబాబు మత్రమే చేసేది.. మిగిలినవారు చేయలేనిదేంటో అర్ధంకాని పరిస్థితి. చంద్రబాబు ఉంటే వ్యాక్సిన్ త్వరగా తయారై.. వ్యాక్సినేషన్ తగ్గిపోతుందా? చంద్రబాబును చూసి దేశాలు ఆక్సిజన్ పంపిస్తాయా? చంద్రబాబు సలహా లేకుండా మోదీ ఏమీ చేయలేరా? చూస్తుంటే.. చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడిపోవడాన్ని కార్యకర్తలు ఇప్పటికీ జీర్ణించుకోలేనట్టుంది. వీరి మానసిక స్థితిని కరోనా వైపరీత్యం అనాలా? టీడీపీ పైత్యం అనాలో అర్ధంకాని పరిస్థితి. దేశం కరోనాతో అల్లాడిపోతోంది. ఎదుటివారిలో ఆత్మస్థైర్యం నింపాల్సిన పరిస్థితుల్లో ఈ కామెంట్లేంటో వారికే తెలియాలి.