మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఏపీ ఈఎస్ఐలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా 988.77 కోట్లా విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలులో రూ. 150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్టు నిర్దారించారు. ఈ అక్రమాలలో ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకై ప్రభుత్వానికి నష్టం కలిగించారని, అప్పటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఒక కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారని, ఇందులో ఆయనకు కమీషన్లు అందాయని ఆరోపణలున్నాయి. ఈ కేసులో సుమారు 78 రోజులు ఏసీబీ కస్టడీలో ఉన్న అచ్చెన్నాయుడు బెయిల్ కోసం ఎంతో ట్రై చేశారు.
జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా ఆయనకు రెండుసార్లు సర్జరీ జరిగింది. రమేష్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతుండగా కరోనా సోకి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. రెండు రోజుల క్రితమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. అయితే అభియోగాల్లో ఉన్నట్టు అచ్చెన్నాయుడుకు కమీషన్లు అందినట్టు తెలియలేదని, బ్యాంకు లావాదేవీల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపడంతో టీడీపీ నేతల్లో ధైర్యం పుంజుకుంది. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్న ప్రజల్లో అచ్చెన్నాయుడు పట్ల సానుభూతి మొదలైంది.
దీంతో ప్రభుత్వం కావాలని అచ్చెన్నాయుడు ను అవినీతి కేసులో ఇరికించిందని, ఇది కక్షపూరిత చర్యేనని, అచ్చెన్నాయుడు అవినీతి చేసినట్టు ఆధారాలు దొరకలేదు కాబట్టి ఆయన మీద చేసిన ఆరోపణలు అబద్దమని ప్రజలకు చెప్పాలని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. ఆ చెప్పేదేదో నేరుగా అచ్చెన్నాయుడే ఇక ప్రెస్ మీట్ పెట్టి చెబితే, కస్టడీలో తాను పడిన కష్టాలు, రెండోసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి రావడం, మధ్యలో కరోనా సోకడం, తాను అవినీతి చేసినాటు ఆధారాలు లేకపోవడం వంటి విషయాలను ఏకరువు పెడితే ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి, జగన్ ప్రభుత్వం మీద ఆగ్రహం పుట్టుకొచ్చే అవకాశం ఉందని ఆశపడుతున్నారు. మరి వారి కోరిక మేరకు అచ్చెన్నాయుడు అత్యవసర ప్రెస్ మీట్ ఏదైనా పెడతారేమో చూడాలి.