అధ్యక్షా అని పిలిపించుకోవడం కన్నా… అధ్యక్షా అని అనాలని ఉంది

ఏపీ సీఎం జగన్ ఏరి కోరి అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను నియమించినా ఆయన సంతృప్తి చేదడం లేదట. తనని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సీఎంపై ఒత్తిడి చేస్తున్నాడట. ఇందుకోసమే టీడీపీపై మాటల యుద్ధానికి తెరలేపుతున్నాడట. వివాదాలకు దూరంగా ఉండాల్సిన స్పీకర్ పదవిలో ఉన్నా … మంత్రి పదవి పై ఉన్న మమకారం కారణంగా టీడీపీపై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారట. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన స్పీక‌ర్ ప‌ద‌విలో ఉంటూ కూడా రాజ‌కీయాల‌ను మాట్లాడ‌తున్నారట. గతంలో చంద్ర‌బాబు హ‌యాంలోనే మంత్రి ప‌ద‌విని నిర్వర్తించిన ఆయ‌న‌… మరోసారి మంత్రికావాలని ఉవ్వీళ్లు ఊరుతున్నారట. బీసీ కోటాలో మంత్రి ప‌ద‌వి వరిస్తుందని ఆశ‌లు పెట్టుకున్నా…రాజకీయ సమీకరణల నేపథ్యంలో అది సాధ్యం కాకపోవడంతో తదుపరి క్యాబినెట్ విస్తరణలో అయినా అవకాశం దక్కించుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారట.

మంత్రి కాలేకపోయానన్న అస‌హ‌నంతో అప్పుడప్పుడు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారట. దీనికి తోడు త‌న‌కు పోటీగా చంద్రబాబు త‌న మేన‌ల్లుడు అయిన కూన ర‌విని ఎంకరేజ్ చేయడం తమ్మినేనికి మరింత చిర్రెత్తుకొస్తోందట. ఎలాగైన మంత్రి అయి నియోజకవర్గంలో మరింత పట్టుసాధించాలని తహతహలాడుతున్నారట. మంత్రి పదవి ఇస్తే టీడీపీని మిగతా వారందరి కంటే ఎక్కువ ప్రతిఘటిస్తానని సీఎం జగన్ కు హామీ ఇస్తున్నారట. పలువురు సీనియర్ నాయకులు కూడా తమ్మినేనికి మద్ధతు పలుకుతున్నారట.

అయితే ఇంత వరకు బాగానే ఉన్నా….శ్రీకాకుళం జిల్లా నుంచి ఈపాటికే ఇద్ద‌రు మంత్రులు ఉండడంతో సీఎం జగన్ వెనకడుగు వేస్తున్నారట. డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, మంత్రి అప్ప‌ల‌రాజుల్లో ఎవర్ని పక్కనపెట్టాలో అర్థం కాక తర్జనభర్జన పడుతున్నారట. వీరిద్ద‌రూ తనకు అత్యంత స‌న్నిహితులు కావడంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. వీరిద్ధర్నిమంత్రి వర్గంలో కొనసాగించి శ్రీకాకుళం నుంచి మూడో వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చే అంశంపై లెక్కలు వేస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో. తమ్మినేని కోరిక తీరుతుందో లేక ఈయన కారణంగా ఇంకెవరికైనా మంత్రి పదవి ఊడుతుందో.